YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి నిత్యం బిజీగా ఉంటున్నారు. వారంలో మూడు రోజులపాటు ఏపీకి వస్తున్నారు. నాలుగు రోజులపాటు మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో గడుపుతున్నారు. అయితే ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫుల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తాడేపల్లి కి వస్తున్న ఆయన పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వారాంతంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. అయితే బెంగళూరులో అంత విశ్రాంతి తీసుకుంటున్నారని భావిస్తున్నారు కానీ.. అక్కడ కూడా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారని తెలుస్తుండడం విశేషం. దేశంలోని ప్రముఖ నేతలతో పాటు రాజకీయ వ్యూహకర్తల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఏపీలో అధికారంలోకి రావడం ఎలా అనే దానిపై ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
* ఇద్దరు వ్యూహకర్తలు రంగంలోకి..
ఇటీవల దేశంలో పేరు మోసిన ఇద్దరు వ్యూహకర్తలను పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పాదయాత్ర ఎలా ప్రారంభించాలి? ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వాలి? అభివృద్ధి విషయంలో ఎటువంటి వ్యూహం అమలు చేయాలి? అనే దానిపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈసారి పాదయాత్ర 5 వేల కిలోమీటర్ల పాటు కొనసాగించాలని ఆ వ్యూహకర్తలు సూచించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కూడా కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఎన్నికల మేనిఫెస్టో విషయంలో సైతం కొన్ని రకాల సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జగన్ ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అన్న సూచన కూడా చేసినట్లు ప్రచారం సాగుతోంది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళక పోవడమే ఉత్తమమని సలహా ఇచ్చినట్లు సమాచారం.
* గెలుపు పై తేల్చేసిన వైనం..
అయితే సదరు వ్యూహకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక విషయాన్ని తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఏపీలో కూటమిని కొట్టడం అంత ఈజీ కాదు అని.. మూడు పార్టీలు బలంగా ఉన్నాయని.. గతం మాదిరిగా అతి ధీమా అనేది వద్దు అని.. ఓ 100 నుంచి 120 నియోజకవర్గాల పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఓ 75 నియోజకవర్గాలు కూటమికి ఏకపక్షంగా ఉన్నాయని.. వాటి జోలికి పోకుండా మిగతా నియోజకవర్గాలపై దృష్టి పెడితేనే కొంత వర్కౌట్ అవుతుందని సలహా ఇచ్చినట్లు సమాచారం. ప్రధానంగా రాయలసీమ జోన్ పై దృష్టి పెట్టాలని.. ఉత్తరాంధ్ర పై ఫోకస్ చేయాలని.. ఉభయగోదావరి తో పాటు కృష్ణా, గుంటూరు విషయంలో అసలు పట్టించుకోవాల్సిన పనేలేదని.. అక్కడ కూటమికి ఎక్కువగా ఛాన్స్ ఉందని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 80 నుంచి 120 నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెడితేనే ఫలితాలు సానుకూలంగా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.