AP DWCRA Women: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక రాయితీ ప్రకటించింది. గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు పై సర్వీస్ ఛార్జీలను మాఫీ చేసింది. అంతేకాకుండా రుణాలపై వడ్డీ కూడా తగ్గించింది. ఐదు లక్షల రూపాయలు దాటిన రుణాలకు సంబంధించి వడ్డీ రేటును 13 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రుణాలు తీసుకునే సమయంలో బ్యాంకులు ప్రాసెసింగ్ తో పాటు డాక్యుమెంట్ చార్జీల పేరుతో సేవ రుసుములు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళా సంఘాలపై భారం పడుతుంది. దీనిపై వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చింది. దీనిపై డ్వాక్రా సంఘాల సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా ప్రకటించడం పై స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయంతో గ్రామీణ బ్యాంకుల్లో యొక్క పై రుణాలు మరింత సులభతరం కానున్నాయి.
* గ్రామీణ బ్యాంకుల ద్వారా అధికం..
డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ గా గ్రామీణ బ్యాంకుల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్, ఇన్స్పెక్షన్, పాస్ బుక్, లేట్జర్, క్యాష్ హ్యాండిలింగ్ వంటి చార్జీలు వసూలు జరుగుతూ ఉన్నాయి. వీటిని రద్దు చేయడం ద్వారా ప్రతి స్వయం సహాయక సంఘానికి 25 వేల వరకు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. గ్రామీణ బ్యాంకు లోని సుమారు 2.75 లక్షల మహిళా సంఘాలకు భారీగా ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వం ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు చాలా రకాల మినహాయింపులు ఇచ్చింది. సంఘాలను బలోపేతం చేయడంతో పాటు వారి ఉత్పత్తులను అంతర్జాతీయంగా మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. వీటిని కొనసాగింపుగా ఈ నిర్ణయాలు తీసుకుంది.
* పొదుపులో ముందంజ..
డ్వాక్రా సంఘాలు అనేవి చంద్రబాబు మానస పుత్రికలు. చంద్రబాబు హయాంలోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు జాతీయస్థాయిలో విస్తరించాయి. అయితే దేశంలోనే ఏపీ డ్వాక్రా సంఘాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీ మహిళలు పొదుపులో దేశంలో అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. 2025 మార్చి 31 నాటికి ఏపీలోని డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకుల్లో రూ.15,917 కోట్లు పొదుపు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది దేశంలోనే అత్యధికం అని.. ఏపీలోని 1.23 కోట్ల మంది మహిళలు దీనిలో భాగస్వామ్యులయ్యారని పేర్కొన్నాయి. మరోవైపు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ ఏపీ మహిళలు ముందున్నారని తెలుస్తుండడం ఆనందకరం.