Pakistan Internal Crisis: అన్ని వైపుల నుంచి అపజయాలు, అంతర్గత తిరుగుబాట్లు, అంతర్జాతీయ ఒంటరితనం ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా తన బలహీనతను దాచి, పైచేయి చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఇలాగే ఉంది. దేశం లోపల, బయట రెండు వైపులా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల దృష్టిని మరల్చేందుకు సైనిక ప్రదర్శనలు, ఆయుధాల రాకపోకల ప్రచారం చేస్తోంది. ఇది సంక్షోభం నుంచి తాత్కాలికంగా తప్పించుకునే ప్రయత్నంగానే విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతర్గత తిరుగుబాట్లు..
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తీవ్రమైన తిరుగుబాట్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా దళాలు నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై కూడా పాకిస్తాన్‌కు అనుకూల ప్రకటనలు రావడం లేదు. సౌదీ అరేబియాతో డిఫెన్స్ ఒప్పందం చేసుకోవడంతో యూఏఈ దూరమైంది. గతంలో గల్ఫ్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్న పాకిస్తాన్, ఇప్పుడు సౌదీకి మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో సైన్యం మీద సొంత ప్రజల నుంచే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రజలు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అంతర్గత సమస్యలు పెరిగే కొద్దీ, పాలకులు బాహ్య శత్రువును సృష్టించి దృష్టి మరల్చే పాత పద్ధతిని అనుసరిస్తున్నారు.
దృష్టి మరల్చేలా కొత్త డ్రామా..
ఇటీవల పాకిస్తాన్ తన గగనతలంలో విమానాలు ఎగరవద్దని, తన సముద్ర జలాల్లోకి ఎవరూ రావద్దని ప్రకటించింది. ఇది భద్రతా ఆందోళనలా కనిపించినా, నిజానికి అంతర్గత సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం. దీనికి తోడు చైనా, తుర్కియే నుంచి భారీగా ఆయుధాలు వస్తున్నాయని ప్రచారం చేస్తోంది. 60 గంటలపాటు పెద్ద విమానాలు వచ్చాయని, నూర్‌ఖాన్ వంటి వైమానిక స్థావరాల్లో చైనా విమానాలు ల్యాండ్ అయ్యాయని, విమానాలు, క్షిపణులు, రాడార్లు వచ్చాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. తుర్కియే నుంచి కూడా ఆయుధాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా ఇంటలిజెన్స్, శాటిలైట్ సమాచారం అందించిందని, తుర్కియే సైనికులు పాక్ దళాలతో కలిసి పనిచేసి కొందరు మరణించారని గత అనుభవాలు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా బలంగా ఉన్నాం అనే భావన కల్పించాలని చూస్తోంది.
ఆయుధాల రాకపై అనుమానాలు..
చైనా–పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో డిఫెన్స్ సంబంధాలు ఉన్నాయి. అయినా ఇప్పుడే భారీగా ఆయుధాలు పంపుతున్నారనే ప్రచారం అనుమానాలు కలిగిస్తోంది. ఏ ఆయుధాలు వచ్చాయో స్పష్టంగా చెప్పడం లేదు. ఇది ఆఫ్ఘనిస్తాన్‌పై లేదా భారత్‌పై దాడికి సన్నాహాలా అన్నట్లు బిల్డప్ ఇవ్వబడుతోంది. కానీ వాస్తవం వేరు. పాకిస్తాన్ ప్రస్తుతం ఏ దేశంతోనైనా యుద్ధం చేసే స్థితిలో లేదు. అంతర్గతంగా చీలిపోయి, ఆర్థికంగా బలహీనంగా ఉంది. సముద్ర మార్గంలో నాలుగు ప్రధాన పోర్టులు ఉన్నాయి. వాటిని భారత్ దిగ్బంధిస్తే వాణిజ్యం, చమురు దిగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
సంక్షోభం నుంచి తాత్కాలిక విముక్తి…
ఆయుధాల రాక, వైమానిక,సముద్ర ఆంక్షలు, యుద్ధ బిల్డప్ ఇవన్నీ అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే వ్యూహం మాత్రమే. బలూచిస్తాన్, ఖైబర్‌లోని తిరుగుబాట్లు, సైన్యం మీద పెరుగుతున్న అసంతృప్తి, అంతర్జాతీయ ఒంటరితనం, వీటిని దాచడానికి బాహ్య శత్రువును సృష్టించడం పాత పద్ధతి.
పాకిస్తాన్ ప్రస్తుత స్థితిలో యుద్ధం చేయగల సామర్థ్యం లేదు. ఆయుధాలు వచ్చినా వాటిని సమర్థంగా ఉపయోగించే ఆర్థిక, రాజకీయ స్థిరత్వం లేదు. ఈ ప్రచారాలు తాత్కాలికంగా ప్రజలను మభ్యపెట్టవచ్చు. కానీ అంతర్గత అగ్ని చల్లబడకపోతే, బాహ్య ప్రదర్శనలు ఎంతకాలం నిలుస్తాయో అనేది ప్రశ్నార్థకం.