Marriage Market : మనం సాధారణంగా మార్కెట్లోకి వెళ్లి కూరగాయలు కొనుగోలు చేస్తాం.. లేదా ఇంటికి సంబంధించిన వస్తువులు కొంటూ ఉంటాం.. దీనిని కూరగాయల మార్కెట్ లేదా షాపింగ్ కాంప్లెక్స్ అని అంటూ ఉంటారు. కానీ చైనాలో పెళ్లిళ్ల మార్కెట్ ఉందన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి, అమ్మాయి వివరాలను మార్కెట్లో పెట్టి విక్రయిస్తున్నారు. పెళ్లి చేసుకునేవారు ఇక్కడికి వచ్చి తమకు కావాల్సినవారిని ఎంచుకుంటున్నారు. అసలు ఇలా చేయడానికి కారణం ఏంటి? చైనాలో పెళ్లిళ్ల విషయంలో ఏం జరుగుతోంది?
చైనాలోని షాంఘై నగరంలో ఉన్న పీపుల్స్ పార్క్ లోకి వెళ్తే ఒక విచిత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ కొన్ని గొడుగులు ఉండగా.. వాటిపై యువతుల, యువకుల కు సంబంధించిన వివరాలు అంటించి ఉన్నాయి. తమకు అర్హులైన వారు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు సంప్రదించాలని నెంబర్లతో సహా రాసి ఉంచారు. అయితే ఈ పెళ్లిల సంత 2005 నుంచి జరుగుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఇలా జరగడానికి కారణం ఏంటంటే?
చైనాలో నివసిస్తున్న యువతి యువకుల తల్లిదండ్రుల డిమాండ్లు విపరీతంగా పెరిగాయి. ఇందుకు కారణంగా వారికి ఆలస్యంగా వివాహం అవుతున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ గణాంకాల ప్రకారం 2020 నాటికి దేశంలో మూడు కోట్ల మంది పెళ్ళికాని యువతీ యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు తమకు నచ్చినవారు దొరకక వివాహం చేసుకోకుండా ఉంటుండగా.. మరికొందరు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే కష్టాల గురించి భయపడి ఒంటరిగా ఉండిపోతున్నట్లు తెలుస్తోంది.
చైనాకు చెందిన ఒక మహిళ మాట్లాడుతూ తన మేనల్లుడికి నెలకు 5 వేల యెన్ల (రూ.50 వేల) సంపాదన వస్తుంది. కానీ అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం నెలకు 10 వేల యెన్ల (రూ. లక్ష) ఆదాయం వచ్చే వారిని ఎంచుకోవాలని చూస్తున్నారు. తన మేనల్లుడికి సరి అయిన అమ్మాయి దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. కొందరి పరిస్థితి ఇలాగే ఉంటే మరికొందరు పెళ్లయిన తర్వాత కుటుంబాన్ని పోషించే బాధ్యత అబ్బాయిలపైనే ఉంటుంది. ఇక్కడ ఇంట్లోకి అవసరమయ్యే గృహోపకరణాలు, ఇతర వస్తువులు మాత్రం అమ్మాయిని చూసుకుంటారు. గతంలో ప్రభుత్వం పెళ్లి చేసుకున్న వారికి ఉచితంగా ఇల్లు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఒక ఇల్లు కొనాలంటే ప్రత్యేకంగా రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా పెళ్లయిన తర్వాత అనేక ఖర్చులు ఉంటాయని భయపడి చాలామంది పెళ్లి చేసుకోవడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ కారణంగా నలభై ఏళ్ల వయసు వచ్చేవరకు చాలామంది పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతున్నారు. దీంతో షాంఘై నగరంలో ఇలా వధూవరుల కోసం ప్రత్యేకంగా మార్కెటు ఏర్పాటు చేశారు. అయితే ఈ మార్కెట్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయా అంటే.. చెప్పలేమని అంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి ఇలా మార్కెట్ ను నిర్వహించడం సరైన పని కాదని అంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేయడానికి చైనా సాంప్రదాయంలో చాలా కుటుంబాలు తమ పిల్లల బాగోవుల కోసం కుటుంబాల పరిస్థితులను ఆరా తీస్తారు. ఇక్కడికి వచ్చి తమ పిల్లల గురించి చెప్పడానికి ఇష్టపడరు.. అని మరికొందరు అంటున్నారు.