Journalist Controversy: మన వ్యక్తిత్వానికి భాష అనేది అత్యంత ముఖ్యం. ఎంత హుందాగా మాట్లాడితే మన వ్యక్తిత్వం అంత గొప్పగా ఉంటుంది. అలాకాకుండా నోరు ఉందని.. చేతిలో మైక్ ఉందని.. జర్నలిస్టు అనే ట్యాగ్ లైన్ ఉందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే జనం చెప్పులతో కొడతారు. అసలే ఇవి సోషల్ మీడియా రోజులు. మనం మంచి చేస్తే ఎంత వేగంగా అయితే స్ప్రెడ్ అవుతుందో.. చెడు చేస్తే అంతకు మించిన వేగంతో స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నరం లేని నాలుక మీద ఖచ్చితంగా అదుపు పెట్టుకోవాలి.
సినిమా సర్కిల్స్ లో జర్నలిస్టులకు.. నటీనటులకు క్లోజ్ రిలేషన్ ఉంటుంది. పైగా సినీ ఫీల్డ్ లో వీర లెవెల్లో రాసే వార్తలు ఉండవు. భజన వార్తలకు మాత్రమే అవకాశం ఉంటుంది. సినీ ఫీల్డ్ లో పనిచేసేవాళ్ళు భజనకు మాత్రమే అలవాటు పడి ఉంటారు. ఇక ఈ భజనలో రకరకాల వ్యవహారాలు ఉంటాయి. భజన బాగా చేసే వాళ్లకు ఒక విధంగా.. మీడియంలో చేసే వాళ్లకు ఇంకొక విధంగా.. లో లెవెల్ లో చేసే వాళ్లకు ఇంకో విధంగా కవర్లు అందుతూ ఉంటాయి. కాకపోతే ఇందులో కొంతమంది తీట రకాలు ఉంటారు. స్థూలంగా చెప్పాలంటే నోటి దూలగాళ్లు అనుకోవచ్చు. వీళ్లు ఎలా మాట్లాడుతారో తెలియదు. ఎందుకు మాట్లాడతారో తెలియదు. కెమెరా ముందుకు రాగానే వీరిలో నటనావేశం పెరిగిపోతుంది. పైగా ఎదుటి వ్యక్తులను గౌరవ వాచకంతో పిలవకుండా నువ్వు నువ్వు అని సంబోధిస్తూ ఉంటారు. అంతటితోనే ఆగిపోరు. ఆ కాడికి వీళ్లు ఏదో గొప్ప వ్యక్తులు అయిపోయినట్టు.. సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అనే సామెతను తిరగరాస్తు ఉంటారు. వినే వాడికి చెప్పేవాడు లోకువ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు.
సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టు గురించి విపరీతంగా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించడం ఇష్టం లేదు. ఆ జర్నలిస్ట్ ఇటీవల సంపూర్ణేష్ బాబు ను ఇంటర్వ్యూ చేశారు. ప్రశ్నలు అడుగుతూ నువ్వు అని సంబోధించారు. అక్కడితోనే ఆగిపోలేదు అసలు నువ్వు ఎప్పుడైనా హీరో అవుతావు.. ఇక్కడదాకా వస్తావు అనుకున్నావా.. నీ కుటుంబంలో ఎవరికి కూడా సినిమా నేపథ్యం లేదు కదా.. నువ్వు సినిమాల్లో ఎలా అవకాశాలు వస్తాయి అని అనుకున్నావు.. ఇలా సాగిపోయింది ఆ జర్నలిస్ట్ ప్రశ్నల పరంపర. దీనికి సంపూర్ణేష్ బాబు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఏ ప్రశ్నకు కూడా నెగిటివ్ సమాధానం చెప్పలేదు. అది సంపూర్ణేష్ బాబు హుందాతనం.
ఈ ఎపిసోడ్ తర్వాత ఆ జర్నలిస్టు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అసలు నువ్వు మనిషివేనా అన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా చైతన్యా రెడ్డి అనే నిర్మాత విషయంలో కూడా సదరు జర్నలిస్టు ఇలానే వ్యవహరించారు. పైగా ఈసారి అర్థం తెలియని సామెతను గుర్తుకు తెచ్చుకొని.. సంబంధం లేని విషయంలో అన్వయించారు. మళ్లీ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నారు. వాస్తవానికి ఇలా మాట్లాడితే లైకులు వస్తాయి అని.. వ్యూస్ లభిస్తాయని.. కామెంట్లు వస్తాయని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఒకసారి చర్చ జరిగినంత మాత్రాన అది గొప్ప విషయం అయిపోదు. పైగా అడ్డగోలుగా మాట్లాడితే జనం ఊరుకునే రోజులు కాదు ఇవి. పైగా సినిమా లో పని చేసే వాళ్లకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారి దాడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అందువల్లే జర్నలిస్టు జర్నలిస్ట్ లాగానే మాట్లాడాలి. అలాకాకుండా మైక్ ఉంది.. కెమెరాలో ముఖం కనిపిస్తోంది.. సోషల్ మీడియాలో రీచ్ ఉంది అనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు.