Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని మరణించాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించాలని రెండు రోజుల క్రితం ఆదేశించింది. దీంతో పాక్ ప్రభుత్వం ఆయనను ఆగస్టు 21న ఆస్పత్రికి తరలించి వెంటనే జైలుకు తరలించింది. పాకిస్తాన్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌పై అనేక కేసులు బనాయించింది. ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్‌తో చేతులు కలిపి ఇమ్రాన్‌ను జైల్లో పెట్టింది. మూడేళ్లుగా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్‌తో రాజీకి సిద్ధమైనట్లు సమాచారం వస్తోంది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో ముఖ్యమైన మార్పుగా విశ్లేషకులు చూస్తున్నారు.
జైలు నుంచి విడుదలకు మార్గం..
ఇమ్రాన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆర్మీని ఎదిరించే ప్రయత్నం చేయరని ఇమ్రాన్ పార్టీ పీటీఐ ప్రతినిధి ఇటీవల సంకేతాలు ఇచ్చారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో మార్పును సూచిస్తోంది. గతంలో మునీర్‌పై తీవ్ర విమర్శలు, విభేదాలు ఏర్పడిన తర్వాతే అవినీతి కేసుల్లో ఇమ్రాన్‌పై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఇరుపక్షాల మధ్య డీల్ కుదిరితే, జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు పెరుగుతాయని అంచనా.
రాజకీయాల్లో ఆర్మీ కీలక పాత్ర..
పాకిస్తాన్‌లో సైన్యం రాజకీయాలపై ఎల్లప్పుడూ ప్రభావం చూపుతుంది. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత కాలంలో కూడా ఆర్మీతో సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుత పరిస్థితిలో ఆయన రాజీకి సిద్ధం కావడం, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి తీసుకుంటున్న వ్యూహంగా కనిపిస్తోంది. జైలు జీవితం సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఆర్మీతో సయోధ్య ఏర్పడితే రాజకీయ రంగంలో తిరిగి చురుకుగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. విశ్లేషకులు దీన్ని కేవలం వ్యక్తిగత రాజీగా కాకుండా, దేశ రాజకీయ సమీకరణల్లో మార్పుగా అభివర్ణిస్తున్నారు. ఆర్మీ, రాజకీయ నాయకుల మధ్య సంబంధాలు సాఫీగా సాగితే, అంతర్గత స్థిరత్వానికి దోహదం చేయవచ్చు.
సాధ్యమయ్యే పరిణామాలు..
డీల్ జరిగితే ఇమ్రాన్ విడుదల కావడమే కాకుండా, పీటీఐ పార్టీ కూడా కొంత ఉపశమనం పొందవచ్చు. అయితే, ఆర్మీతో సయోధ్య తర్వాత ఆయన రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది, ప్రజల్లో తన ప్రభావాన్ని ఎలా నిలబెట్టుకుంటారు అనేది ముఖ్యమైన అంశం. గతంలో ఆర్మీని విమర్శించిన వైఖరి నుంచి మార్పు రావడం, మద్దతుదారుల్లో కొంత అయోమయాన్ని సృష్టించవచ్చు. మరోవైపు, ఆర్మీ దృష్టిలో ఇమ్రాన్‌ను నియంత్రణలో ఉంచడం, రాజకీయ అస్థిరతను తగ్గించడం లక్ష్యంగా ఉండవచ్చు. ఇరుపక్షాలు ఒకరికొకరు అవసరమని గుర్తిస్తే ఈ రాజీ ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం ఉంది.
ఇమ్రాన్ ఖాన్, జనరల్ మునీర్ మధ్య సాధ్యమయ్యే ఈ సయోధ్య పాకిస్తాన్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఇది కేవలం ఒక వ్యక్తి విడుదలకు సంబంధించిన విషయం కాదు.. సైన్యం, రాజకీయ నాయకత్వం మధ్య సంబంధాల పునర్నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన పరిణామం. భవిష్యత్తులో ఈ డీల్ ఎలా ముందుకు సాగుతుందో, దాని పరిణామాలు ఏమిటో చూడాలి.