Telangana TDP : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అక్కడ అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి కూడా. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంది. మరోవైపు భారత రాష్ట్ర సమితి సైతం గట్టిగానే ప్రయత్నాలు చేయనుంది. బిజెపి సైతం బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తోంది. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. అందుకే అందరి దృష్టి వారిపై ఉంది. మరోవైపు జనసేన సైతం అభ్యర్థులను బరిలో దించి కీలక స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది చర్చ. మొన్నటి సార్వత్రిక ఎన్నికలతో పాటు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయలేదు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముందుగా తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవి భర్తీ చేసి.. బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టాలన్నది ఆలోచనగా తెలుస్తోంది.
* వ్యూహాత్మకంగా తప్పుకొని..
2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బరిలో దిగలేదు. కానీ ఆ పార్టీ సానుభూతిపరులు కొన్నిచోట్ల పోటీ చేసి విజయం అందుకున్నారు. అయితే ఎందుకో తెలంగాణ టిడిపి విషయంలో చంద్రబాబు దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అక్కడ అన్ని రాజకీయ పార్టీలు టిడిపి వైపు ఆశగా ఎదురు చూసేవి. కానీ తెలంగాణ సెంటిమెంట్ పుణ్యమా అని టిడిపి విషయంలో జరిగిన విష ప్రచారం కూడా ఎక్కువ. టిడిపి పోటీ చేసిన ప్రతిసారి కెసిఆర్ చంద్రబాబును బూచిగా చూపి లాభపడ్డారు. దీనిని గ్రహించిన చంద్రబాబు 2023 ఎన్నికల్లో పూర్తిగా పోటీ చేయలేదు. అప్పుడు భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. మళ్లీ బీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే చంద్రబాబు పై ఉన్న వ్యతిరేక ప్రచారాన్ని కెసిఆర్ అంతకు ముందు క్యాష్ చేసుకున్నారన్నమాట.
* అభివృద్ధి మంత్రంగా..
తెలంగాణలో సెంటిమెంట్ అనేది పూర్తిగా కనుమరుగయ్యింది. ప్రస్తుతం అభివృద్ధి అజెండాను తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే టిడిపి బలోపేతానికి ఇదే సరైన సమయం అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా తెలంగాణ టిడిపి అధ్యక్ష బాధ్యతలను భర్తీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేస్తే చాలా మంది నేతలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బాబు మోహన్, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి పార్టీలో పని చేసేందుకు ముందుకు వచ్చారు. మీరే కాదు పదుల సంఖ్యలో నాయకులు తిరిగి టిడిపిలోకి క్యూ కట్టే అవకాశం ఉంది. చాలామంది చంద్రబాబుకు స్వచ్ఛందంగా టచ్ లోకి వస్తున్నారని కూడా తెలుస్తోంది.
* ఆశావహులు అధికం..
తెలంగాణ టిడిపి బాధ్యతలు తీసుకునేందుకు చాలా మంది నేతలు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని విభేదిస్తూ బయటకు వచ్చారు కవిత. ఆమె సైతం టిడిపిలో పనిచేసేందుకు అప్పట్లో ముందుకు వచ్చారని ప్రచారం సాగింది. అయితే నందమూరి కుటుంబం నుంచి మహిళా నేతగా ఉన్న హరికృష్ణ కుమార్తె సుహాసిని సైతం ప్రస్తుతం ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. మరోవైపు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సైతం బాధ్యతలు అప్పగిస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిసి వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ సైతం పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆశిస్తున్నారు. అయితే ముందుగా బలమైన నేతలను చేర్చుకొని తర్వాత అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని టిడిపిలో ఒక ప్రచారం ఉంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలి.