Borugadda Anil Kumar : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జలకు వ్యతిరేకంగా ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. తాడేపల్లి లోని జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ధర్నాకు కూడా దిగారు. ఏపీ రాజకీయాలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇదో కుదుపు. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళుతున్న తనను సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ అడ్డుకుంటోందని.. తనపై కావాలని రౌడీషీటర్ ముద్ర వేయించి రాజకీయంగా బలి తీసుకుంటున్నారని అనిల్ బోరుగడ్డ ఆరోపిస్తున్నారు. అయితే ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసింది కాదు. దీని వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మొత్తం సజ్జలను టార్గెట్ చేస్తూ పెద్ద బాస్ ఇదంతా నడుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
* మున్ముందు మరింత మంది..
సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా చాలా గొంతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పైకి లేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలో సజ్జల చెప్పిందే మాట్లాడానని.. ఇప్పుడు తనను బలి పశువు చేశారంటూ బోరుగడ్డ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కథ వేరే ఉంది. సజ్జల తీరుతో బోరుగడ్డ మాదిరిగా చాలామంది ఇబ్బంది పడ్డారు. అటువంటి వారంతా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడేలా ఒక వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి తీరుతో పార్టీకి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయో.. సంచలనాత్మక ఆధారాలు, లీకులు త్వరలోనే బయటకు రానున్నట్లు తెలుస్తోంది. అందులో భాగమే బోరుగడ్డ సడన్ ఎంట్రీ అని ప్రచారంలో ఉంది.
* సజ్జల వైఖరిలో మార్పు..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పెరిగింది. ప్రభుత్వంతోపాటు పార్టీలో తన పట్టు పెంచుకుంటూ నెంబర్ 2 స్థాయికి ఎదిగారు. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఆయన తీరుతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్న విషయం జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ వచ్చింది. పొలిటికల్ మేనేజ్మెంట్లో సజ్జలకు సమర్థత లేదని.. ఆయన వైఖరి వల్ల పార్టీకి మేలు కంటే క్యాడర్లో పెరుగుతున్న తీవ్ర అసంతృప్తి, నష్టమే ఎక్కువ అని పార్టీ హైకమాండ్ గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలో నంబర్ 2 స్థానం నుంచి సజ్జలకు ఉద్వాసన తప్పదని.. ఈ ఆపరేషన్ లో భాగంగానే బోరుగడ్డ అనిల్ ను తెరపైకి తెచ్చారన్న ప్రచారం నడుస్తోంది పొలిటికల్ వర్గాల్లో.
* నమ్మకం కోల్పోవడంతో..
సజ్జల రామకృష్ణారెడ్డి పై అధినేత జగన్మోహన్ రెడ్డికి నమ్మకం పోయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన స్థానంలో పార్టీని గాడిన పెట్టడానికి గతంలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని పార్టీలోకి తీసుకురావాలన్న డిమాండ్ క్రమేపి పెరుగుతోంది. విజయసాయిరెడ్డి పార్టీలోకి ఎంట్రీ కి సంబంధించిన చర్చలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే సజ్జలకు వ్యతిరేకంగా ఇలాంటి తిరుగుబాటు అస్త్రాలు బయటకు రావడం అనుమానాలకు తావిస్తోంది.
* విజయసాయిరెడ్డి అవసరం..
ప్రస్తుతం విజయసాయిరెడ్డి అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఉంది. దానికి కారణం లేకపోలేదు. పార్టీని కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు జాతీయస్థాయిలో సమన్వయం చేసుకోవడంలో విజయసాయిరెడ్డి సిద్ధహస్తుడు. అందుకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయనను పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. నేరుగా సజ్జల సేవలను వద్దనుకుంటే వచ్చే ఇబ్బందులు తెలుసు. అందుకే ఒక పద్ధతి ప్రకారం తన సొంత నెట్వర్క్ తో సజ్జలపై ఒత్తిడి పెంచి.. ఆయనను స్వచ్ఛందంగా తప్పుకునేలా వ్యూహం అన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. పార్టీ కార్యాలయం ఎదుట బోరుగడ్డ లాంటి వారు నిరసన తెలిపారు అంటే కచ్చితంగా దాని వెనుక స్క్రిప్ట్ ఉంటుంది. ఇది ఇంతటితో ఆగదు. మున్ముందు చాలామంది బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.