Sanjay Dutt : బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ మరోసారి వార్తల్లో నిలిచారు. గాంధీ జయంతి సందర్భంగా శేఖర్ సుమన్ నిర్వహిస్తున్న ‘శేఖర్ టునైట్’ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ దత్.. దేశ రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా భారత్‌లో గతంలో ఉన్నంత శాంతి ఇప్పుడు కనిపించడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘మునుపటిలా శాంతి ఫీల్ కావడం లేదు’
కార్యక్రమంలో సంజయ్ దత్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలు ఎంతో ప్రేమతో, విశాల హృదయంతో ఉంటారని అన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించే సంస్కృతి భారతీయుల్లో ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం దేశంలో గతంలో ఉన్నంత శాంతిని తాను అనుభవించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.
“ఈ దేశ ప్రజలు చాలా మంచివారు. ఇక్కడ శాంతి ఉండాలి. ఇప్పుడు నేను ఈ దేశంలో ఇంతకుముందులా శాంతిని ఫీల్ కావడం లేదు. మనం ఇండియన్స్ పెద్ద మనసున్న వాళ్లం. అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. మనం ప్రపంచానికి చాలా ఇచ్చాం. ఇక ముందు కూడా అలాగే ఉండాలి. ఆ శాంతి, ఆ రోజులు త్వరగా తిరిగి రావాలని శివుడిని ప్రార్థిస్తున్నా” అని సంజయ్ దత్ అన్నారు. శాంతి ప్రేమతో వస్తుందని, ప్రేమను పెంచేందుకు ‘గాంధీగిరి’ అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఐదు నిమిషాలు ప్రధానమంత్రిగా..
కార్యక్రమంలో సంజయ్ దత్‌ను ఐదు నిమిషాల పాటు దేశ ప్రధానమంత్రిగా ఊహించుకుని మాట్లాడమని కోరారు. దీంతో ఆయన తన ‘మున్నాభాయ్’ పాత్రను గుర్తుచేసే స్టైల్‌లో సరదాగా, వ్యంగ్యంగా ప్రసంగించారు.
“నా ప్రియమైన దేశవాసులారా.. ఈరోజు నేను మీ పీఎంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద దేశం, ఇంతమంది ప్రజలు.. ఇప్పుడు మనందరి బాధ్యత నా మీద ఉంది. అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్లను. మీ మధ్యే ఉంటాను. లేకపోతే ప్రధాని, ప్రజలకు కనెక్షన్ ఎలా ఉంటుంది?” అంటూ చమత్కరించారు.
నాలుగో కోతి కావాలంటూ..
మహాత్మా గాంధీ మూడు కోతుల సిద్ధాంతాన్ని కూడా సంజయ్ దత్ తనదైన శైలిలో ప్రస్తావించారు. చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదనే మూడు కోతుల స్థానంలో ఇప్పుడు నాలుగో కోతి అవసరమని అన్నారు.
“చెడును చూస్తే దాన్ని సరిచేసేది ఎవరు? కళ్లను, చెవులను, నోటిని మూసుకుని కూర్చుంటే దేశం ఎలా ముందుకు వెళ్తుంది?” అంటూ ప్రశ్నించారు.
నాయకుల ఫొటోలపై సెటైర్
ప్రధాని ఫొటోలు ఎక్కడపడితే అక్కడ పెట్టే సంస్కృతిపై కూడా సంజయ్ దత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఎక్కడ ప్రధానమంత్రి ఫొటో ఉందో అక్కడ వాటిని తగ్గించి, మహాత్మా గాంధీ ఫొటోలు పెట్టాలని అన్నారు. నాయకుల ఫొటోల కంటే దేశాన్ని, దేశ విలువలను ప్రజలకు చూపించడం ముఖ్యమని పేర్కొన్నారు.
ట్రంప్‌కు ‘జాదూ కీ ఝప్పీ’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ విధానంపైనా సంజయ్ దత్ తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచాన్ని ‘ఫ్రేమ్ నుంచి బయటకు పంపే’ ప్రయత్నాలు చేయొద్దని ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో క్షిపణులు ఉన్నాయని, ఇక కొంత ప్రేమను కూడా ఎగుమతి చేయాలని సూచించారు.
ఎవరినైనా బెదిరించాలనిపిస్తే ముందుగా ఫోన్ చేసి ఇంటికి పిలిచి, చాయ్ తాగుతూ సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. చివర్లో “అమెరికా.. నీకు జాదూ కీ ఝప్పీ ఇవ్వడానికి నేను వస్తున్నా” అంటూ ‘మున్నాభాయ్’ స్టైల్‌లో ముగించారు.
‘లగే రహో మున్నాభాయ్’లో గాంధీగిరి
సంజయ్ దత్ 2006లో విడుదలైన లగే రహో మున్నాభాయ్ చిత్రంలో మున్నాభాయ్ పాత్రలో నటించారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గాంధీగిరి సిద్ధాంతాన్ని వినోదాత్మకంగా చూపించారు. అర్షద్ వార్సీ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. తాజాగా సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యల్లోనూ అదే ‘గాంధీగిరి’ శైలి కనిపించడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.