Aadhaar Update : ఆధార్ కార్డులో పేరు సవరణ లేదా మార్పు చేసుకోవాలనుకునే వారికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక మార్పులు చేసింది. పేరు అప్‌డేట్‌కు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను తీసుకొచ్చింది. ఇక ఆధార్‌లో పేరును మార్చే సందర్భాన్ని బట్టి ప్రత్యేక విధానం, నిర్దిష్ట పత్రాలు, అవసరమైన చోట ప్రత్యేక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పేరు మార్పు కోసం ఆధార్ కేంద్రాలను ఆశ్రయించే వారు తమకు వర్తించే నిబంధనలను ముందుగానే తెలుసుకోవడం అవసరం.
డేటా ఎంట్రీ తప్పిదమైతే..
ఆధార్ నమోదు సమయంలో డేటా ఎంట్రీ పొరపాటు కారణంగా పేరు తప్పుగా నమోదై ఉంటే ప్రత్యేక విధానం ఉంటుంది. గతంలో సమర్పించిన గుర్తింపు లేదా సంబంధిత పత్రంలో సరైన పేరు ఉన్నట్లయితే, వయోజనులు అనెక్సర్-బి, మైనర్లు అనెక్సర్-సి అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు UIDAI సూచించిన గుర్తింపు లేదా సంబంధ పత్రాన్ని కూడా ఇవ్వాలి.
పెళ్లి, విడాకుల తర్వాత ఇంటిపేరు మార్పు
వివాహం తర్వాత ఇంటిపేరు (సర్‌నేమ్) మార్చుకోవడం లేదా విడాకుల అనంతరం పాత ఇంటిపేరును తిరిగి పొందడం వంటి సందర్భాలకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇలాంటి మార్పుల కోసం అనెక్సర్-డి అఫిడవిట్తో పాటు అవసరమైన గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
‘అలియాస్’ తొలగింపునకు ప్రత్యేక అఫిడవిట్
పేరులో ‘ఉర్ఫ్/అలియాస్’గా మరో పేరు నమోదై ఉండి, అందులోని ఒక పేరును తొలగించి ఒకే పేరును కొనసాగించాలనుకుంటే ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది. వయోజనులు అనెక్సర్-ఈ, మైనర్లు అనెక్సర్-ఎఫ్ అఫిడవిట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
పెద్ద మార్పులకు గెజిట్ నోటిఫికేషన్
పేరు లేదా గుర్తింపులో భారీ మార్పు చేయాలనుకుంటే కేవలం సాధారణ పత్రాలతో సరిపోకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. ముఖ్యంగా పూర్తిపేరు లేదా మొదటి పేరు పూర్తిగా మార్చే సందర్భంలో గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు పాత పేరు ఉన్న గుర్తింపు పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
బిరుదులు, ర్యాంకులు తొలగించుకోవచ్చు
ఆధార్‌లో పేరుకు ముందు లేదా తర్వాత డాక్టర్, కర్నల్, శ్రీ, శ్రీమతి, మిస్టర్ వంటి ర్యాంకులు, బిరుదులు లేదా ప్రిఫిక్స్‌లు నమోదై ఉంటే వాటిని తొలగించుకునేందుకు కూడా SOPలో నిబంధనలు ఉన్నాయి. ఇందుకోసం నిర్దేశించిన గుర్తింపు పత్రాల ఆధారంగా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలి.
పాత అఫిడవిట్‌తో దరఖాస్తు చేయొద్దు
పేరు అప్‌డేట్ చేసుకునే సమయంలో ప్రతి ఒక్కరూ తమ కేసుకు వర్తించే కేటగిరీ ప్రకారం సంబంధిత అఫిడవిట్, గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత నమూనా అఫిడవిట్‌తో దరఖాస్తు చేస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పేరు అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆధార్‌లో పేరును రెండుసార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్పులు చేయాలంటే గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు UIDAI నిర్దేశించిన ప్రత్యేక మినహాయింపు విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.