YS Jagan: అదే కోపం.. అదే ప్రయాస.. అదే విషం.. లక్షల కోట్లు వచ్చినప్పటికీ.. రూపురేఖలు మారుతున్నప్పటికీ.. జనాలు హర్షిస్తున్నప్పటికీ జగన్ కు వీసమెత్తు సంతృప్తి కూడా లేదు. పైగా అడ్డగోలు రాతలతో.. తనలో అక్కసు బయట పెట్టుకున్నారు. సొంత మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేయించి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు.
రాయలసీమ ప్రాంతంలో దాదాపు లక్ష కోట్లతో వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడానికి కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేసింది. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని తీసుకొచ్చింది. మదనపల్లి ప్రాంతంలో రిలయన్స్ భాగస్వామ్యంతో అతిపెద్ద సంస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. దీని ద్వారా హార్టికల్చర్ విభాగంలో అద్భుతమైన సేవలు రైతులకు అందబోతున్నాయి. అత్యంత విలువైన పంటలు రాయలసీమ ప్రాంతంలో పండబోతున్నాయి. వాస్తవానికి ఈ పరిణామాన్ని ఏ రాజకీయ నాయకుడైనా సరే స్వాగతిస్తారు. పైగా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే హర్షం వ్యక్తం చేస్తుంటారు. కానీ జగన్ దీనికి పూర్తి భిన్నం.
పైగా సొంత మీడియాలో ఈ కార్యక్రమానికి వికృత అర్థం తీసుకొచ్చారు. ఎప్పటి మాదిరిగానే వితండ వాదాన్ని చేశారు.. లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ కాదట, లక్ష అబద్దాలతో చంద్రబాబు పరిపాలన అంట. చంద్రబాబు వ్యవసాయాన్ని గబ్బు పట్టించారట.. ఒకవేళ ఆయనకు అలాంటి ఉద్దేశం ఉండి ఉంటే.. హంద్రీనీవా, గాలేరు, నగరి, సిబిఆర్ వంటి ప్రాజెక్టులను చంద్రబాబు ఎందుకు ఏర్పాటు చేస్తారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఎందుకు నిర్మిస్తారు. కేసీ కాలువ లిఫ్ట్ ఎందుకు ఏర్పాటు చేస్తారు. ఈ విషయం జగన్ చెప్పనంత మాత్రాన ప్రజలకు తెలియదా.. పైగా అంతటి అంబానీ కుమారుడు చంద్రబాబు కాళ్ళ మీద పడ్డాడు. ఆయన దార్శనికతను కొనియాడాడు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం గొప్పగా ఉందని చెప్పాడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏనాడు కూడా రిలయన్స్ ప్రతినిధులు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. పైగా రాజకీయ అవసరాల కోసం మాత్రమే జగన్ ను వాడుకున్నారు. పైగా తన తండ్రి మరణానికి నాడు రిలయన్స్ కారణమంటూ హంగామా చేసిన వైసీపీ నేతలు.. ఆ తర్వాత రిలయన్స్ అధినేత సూచించిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సి వచ్చింది. ఇటువంటి డబుల్ డైవర్షన్ పాలిటిక్స్ కు జగన్ కు అలవాటు.. అందువల్లే ఆయన రాయలసీమ బాగుపడుతుంటే ఓర్చుకోలేకపోతున్నారని టిడిపి నాయకులు అంటున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొన్న సమావేశానికి కూడా సరైన కవరేజ్ ఇవ్వకపోతే దాన్ని ఏమనుకోవాలని టిడిపి నేతలు అంటున్నారు. లోపల పేజీలో మామ అనిపించిన వార్తలో కనీసం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. లోకేష్ ప్రస్తావన లేకుండా చూసుకున్నారని.. ఇటువంటి వ్యక్తులు రాయలసీమ బాగుపడుతుంటే ఎలా ఓర్చుకుంటారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే.. రాయలసీమ అభివృద్ధి జోరుగా సాగిపోతూ ఉంటుందని.. లక్షల కోట్ల వరద వస్తూనే ఉంటుందని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.