Kalvakuntla Kavitha: తెలంగాణలో 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నటికి తెలంగాణ రక్షణ సేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహాలు రూపొందిస్తున్నారు. పార్టీ గురించి నిత్యం ప్రజల్లో చర్చ జరగాలని ఉద్దేశంతో సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవలే ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో టిఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను, కుటుంబంలోని లోపాలను బయటపెట్టారు. తాజాగా రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తిస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేతగా కల్వకుంట్ల కవిత ఒక సాహసోపేత ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమిలేని నిరుపేదలకు ‘భూలక్ష్మి’ పథకం ద్వారా ఒక్కొక్కరికి ఒక ఎకరం భూమి కేటాయిస్తామని ప్రకటించారు. ఇది కేవలం ఎన్నికల వాగ్దానంగా కాకుండా, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన దిశగా కీలక ప్రకటనగా విశ్లేషకులు భావిస్తున్నారు.
భూలక్ష్మి పథకం పేరుతో..
కవిత చెప్పిన ప్రకారం ఈ పథకం మూల ఉద్దేశం రాష్ట్రంలోని ప్రతి భూమిలేని పేద కుటుంబానికి సమానంగా భూమి అందుబాటులో ఉండాలి. భూమి అనేది కేవలం ఆస్తి కాదు.. జీవనాధారం, గౌరవం, తరతరాల స్వావలంబన. అనేక మంది వ్యవసాయ కూలీలు, భూమిలేని కుటుంబాలు ఇప్పటికీ ఇతరుల భూముల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఉచిత వైద్య ప్రకటన..
తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రకటించిన రోజు తమ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య అందిస్తామని తెలిపారు. ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా ఉచితంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు భూమి పంపిణీని ముందుకు తీసుకువచ్చారు. విద్య, భూమి ప్రాథమిక అవసరాలుగా కవిత భావిస్తున్నారు.
రాష్ట్రంలో భూమి పంపిణీ అవసరం..
తెలంగాణలో భూమి పంపిణీ అంశం కొత్తది కాదు. గత ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా భూమి కేటాయింపులు చేసినప్పటికీ, అనేక మంది ఇంకా భూమిలేని స్థితిలోనే ఉన్నారు. కవిత ఈ వాస్తవాన్ని గుర్తు చేస్తూ “రాష్ట్రంలో భూమి పంపిణీ జరగాల్సి ఉంది” అని నొక్కి చెప్పారు. ఆమె దృష్టిలో భూమి లేని వారికి భూమి ఇవ్వడం అనేది సామాజిక సమానత్వం వైపు తీసుకెళ్లే అడుగు. ఈ మేరకు భూలక్ష్మి పథకం పోస్టర్‌ను కూడా విడుదల చేసిన నేపథ్యంలో, ఈ ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.
రాజకీయ సంచలనం..
కవిత ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చను తీసుకువస్తుంది. భూమి అంశం ఎప్పుడూ సున్నితమైనది. అమలు చేయాలంటే భూమి లభ్యత, గుర్తింపు, పంపిణీ విధానం, నిధులు వంటి అనేక సవాళ్లు ఉంటాయి. అయినా కవిత ఈ అంశాన్ని స్పష్టంగా ముందుకు తీసుకురావడం ఆమె పార్టీ దృష్టిని ప్రజల వైపు మరింతగా మళ్లించింది. విద్యతో పాటు భూమిని కూడా ప్రాథమిక హక్కుగా చూడాలనే ఆలోచన కవితకు ఉన్నట్లు తెలుస్తోంది ప్రకటనలో కనిపిస్తోంది. భూమి లభిస్తే కుటుంబాలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తాయని భావిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కల్వకుంట్ల కవిత చేసిన ‘భూలక్ష్మి’ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త సంచలనం. భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి అనే లక్ష్యం ఎంత సాహసోపేతమైనదో, అంతే సవాల్ తో కూడినది. అయినా ఈ దృష్టి సామాజిక న్యాయం, సమానత్వం వైపు మరోసారి దృష్టిని మళ్లిస్తోంది. అధికారంలోకి ఈ వాగ్దానం ఎలా అమలు చేస్తారో చూడాలి. కాజా ప్రకటన మాత్రం తెలంగాణ రక్షణ సేన పార్టీని, కవితను ప్రజల చర్చల్లో మరింతగా నిలబెట్టింది.