Megastar Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలంగాణ లో గద్దర్ అవార్డుల ప్రదానంలో ఏపీని ఉద్దేశించి ఆయన పక్క రాష్ట్రం అని సంబోధించారు. నంది అవార్డు లాంటి ప్రోత్సాహం అందించడంలో పక్క రాష్ట్రం వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. అప్పటినుంచి సోషల్ మీడియాకు మెగాస్టార్ చిరంజీవి టార్గెట్ అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు జనసేన నేత ఒకరు మీడియా ముందుకు వచ్చారు. చిరంజీవి పై తప్పుడు ప్రచారం చేస్తే బాగుండదని హెచ్చరించారు. కూటమి 15 ఏళ్ల పాటు కొనసాగాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటే.. ఇలా చేయడం ఏంటని వ్యాఖ్యానించడం ద్వారా టిడిపి పై అనుమానం వచ్చేలా మాట్లాడారు. చిరంజీవి వివాదం కాస్త కూటమిలోనే విభేదాలు సృష్టించేలా ఉంది.
* చంద్రబాబు ప్రస్తావన తెచ్చేసరికి..
మెగాస్టార్ చిరంజీవి యధాలాపంగా మాట్లాడారు. అయితే నేరుగా చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడానికి ఎక్కువమంది సహించడం లేదు.. వాస్తవానికి నంది అవార్డులను నిలిపివేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన విషయంలో అసలు మాట్లాడలేదు. కొద్ది రోజుల కిందట జనసేనకు చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నంది అవార్డుల పై కీలక ప్రకటన చేశారు. నంది అవార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ప్రమేయం లేకుండా సినిమా రంగానికి సంబంధించి ఏ నిర్ణయం కూడా టిడిపి కూటమి ప్రభుత్వం తీసుకోదు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవికి కూడా తెలుసు. కానీ మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు చేయడం పైనే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. పైగా ఎన్టీఆర్ పేరుతో అవార్డు తీసుకొని.. ఆయన పేరును ప్రస్తావించలేదు. దీంతో చిరంజీవిపై వస్తున్న నెగిటివ్ ప్రచారం వెనుక టిడిపి ఉందన్నది జనసేన లో ఉన్న అనుమానం. ఇప్పుడు దానినే బయటపెట్టారు గుంటూరు జనసేన అధ్యక్షుడు.
* గతంలో బాలకృష్ణ వైఖరిపై..
గతంలో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చిత్ర పరిశ్రమ విషయంలో జగన్ వైఖరిని తప్పుపడుతూ మాట్లాడారు. అప్పట్లో చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు బాలకృష్ణ. దానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మెగా ఫ్యాన్స్. అటువంటిది తెలంగాణ వేదికపై పక్క రాష్ట్రం అనడమే కాదు చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడం ఏమిటనేది టిడిపి శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఈ వివాదం కూటమిలోనే చిచ్చు పెట్టేలా ఉంది. చిరంజీవి ఎటువంటి వ్యాఖ్యలు చేసిన అవి చివరకు వివాదాస్పదంగా మారుతున్నాయి. అటు నందమూరి బాలకృష్ణ సైతం అందుకే సైలెన్స్ పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు బాహటంగా జనసేన నేతలు ముందుకు వచ్చి వ్యాఖ్యానాలు చేస్తుండడం పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే చిరంజీవి విన్నపం మేరకు ఏపీ ప్రభుత్వం నంది అవార్డులకు జ్యూరీ కమిటీ ఏర్పాటు చేసే పనిలో ఉందని సమాచారం. అనవసరంగా కూటమిలో వివాదం తలెత్తకుండా ఉండాలంటే నేతలు సైలెన్స్ పాటించడమే ఉత్తమం. దీనిపై టిడిపి తో పాటు జనసేన ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..