Amaravati Capital : అమరావతి రాజధానిలో మరో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. రాజధానికి ఆయువుపట్టుగా భావిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి రానుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోడ్డును ప్రారంభించనున్నారు. అమరావతి రాజధానికి ప్రధాన రహదారి మార్గం కూడా ఇదే. దీనిని విజయవాడ- మంగళగిరి మార్గానికి అనుసంధానం చేయడంతో రాజధానికి నేరుగా వెళ్లడానికి మార్గం సుగమం అయింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న క్రమంలో గ్రిడ్ తరహాలో రహదారుల నిర్మిస్తున్నారు. దానికి వెన్నెముకగా నిలవనుంది ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు. సీడ్ యాక్సిస్ రోడ్డు రెండు దశలు పూర్తిచేసుకుంది. మూడో దశ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ వెళ్ళవచ్చు.
* రాజధానిలో అత్యంత కీలకం..
అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకపాత్ర ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు వహిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోడ్డు దొండపాడు నుంచి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆసుపత్రి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారితో కలుస్తుంది. మొత్తం పొడవు 21.77 కిలోమీటర్లు. మూడు దశల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి గాను రూ.1,519 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇదే రోడ్డు మీదుగా అమరావతి లోని సచివాలయం, హైకోర్టు, ప్రజాప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్లు, ఉద్యోగుల క్వార్టర్లు, మంత్రుల నివాసాలు, పరేడ్ మైదానానికి చేరుకోవచ్చు.
* చాలా ప్రత్యేకతలు..
ఎన్నెన్నో ప్రత్యేకతలు ఈ రోడ్డు సొంతం. 60 మీటర్ల వెడల్పుతో తొమ్మిది లీల రహదారిలో బి ఆర్ టి ఎస్ కారిడార్, ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రైనేజీ, తాగునీటి సరఫరా, గ్యాస్, విద్యుత్, నెట్వర్కులకు అవసరమైన మౌలిక వసతులను రహదారి నిర్మాణంతో పాటు కల్పిస్తున్నారు. సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్, గ్రీన్ బెల్టులతో ఆధునిక నగర రహదారిగా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు రూపొందింది. త్వరలో మూడో దశ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. మరికొద్ది సమయంలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా.. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభం కానుంది.