Amaravati Seed Access Road : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి జీవనాడి లాంటిది సీడ్ యాక్సిస్ రోడ్డు. దీని ద్వారానే అమరావతిలో అనేక రకరకాల కార్యకలాపాలు వేగవంతంగా సాగుతాయని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భావించారు. అందువల్లే ఈ రోడ్డును అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన నిర్మించాలని అనుకున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇచ్చారు.. అయితే ఒక మహిళ మాత్రం ఈ రోడ్డు నిర్మాణం విషయంలో ఏ మాత్రం సహకరించలేదు.
అమరావతి రాజధాని పరిధిలోని దొండపాడు నుంచి ఉండవల్లి వరకు 18.27 కిలోమీటర్ల మేరా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. తాడేపల్లి మండలం పెనుమాక వద్ద ఉన్న కేవలం 65 సెంట్లు భూమికి సంబంధించి ఏళ్ల తరబడి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాడేపల్లి మండలం మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం సమీపంలోని పెనుమాక రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 39/2 సీ lo నిర్మలత అనే మహిళకు 65 సెంట్ల భూమి ఉంది. ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి ప్రకటన కూడా ఇచ్చింది. ఒక కోటి 43 లక్షల 28 వేల 157 రూపాయల పరిహారం కేటాయించినప్పటికీ ఆమె దానిని తిరస్కరించింది. కోర్టును ఆశ్రయించింది. కోట్ల రూపాయల వ్యయంతో రెండు స్టీల్ వంతెనలు నిర్మించినప్పటికీ.. నిర్మలత స్థలం ఇవ్వకపోవడంతో.. ఈ రోడ్డు నిర్మాణాన్ని ప్రమాదకరమైన మలుపుగా తిప్పక తప్పలేదు.
రోడ్డు నిర్మాణం ఆగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు వెళ్లక తప్పలేదు. భూ పరిహారం చెక్కులను తిరస్కరించడంతో ఏపీ సి ఆర్ డి ఏ ఆ మొత్తాన్ని (ఉండవల్లి పరిధిలో ఉన్న రెండేకరాల 77 సెంట్లు భూమికి మొత్తంగా ఏడు కోట్ల 14 లక్షలు) భూ సేకరణ కోర్టులో జమ చేసింది.. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ వివాదం కోర్టులో నలిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ వ్యవహారం మీద మొత్తానికి స్పందించింది. మెజారిటీ రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన నేపథ్యంలో.. కేవలం 65 సెంట్లు భూమికి సంబంధించిన నివాదం వల్ల ప్రజల కోసం చేపట్టే భారీ ప్రాజెక్టు నిలిపివేయలేమని ఆదేశాలు జారీ చేసింది. రైతుల పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు రోడ్డు నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించింది.
ఈ అడ్డంకులు దాదాపు పది సంవత్సరాల తర్వాత తొలగిపోవడంతో.. ఏపీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును అధికారికంగా ప్రారంభించారు. ఒకరకంగా అమరావతి చరిత్రలో ఇది అద్భుతమైన ఘట్టం. దీనికోసమే చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని టిడిపి నేతలు అంటున్నారు. ఈ రోడ్డు ద్వారా రాజధాని ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని టిడిపి నేతలు చెబుతున్నారు. నిర్మలత గనక సహకరించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని.. కానీ ఆమె వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించిందని.. అందువల్లే పరిస్థితి ఇలా మారిపోయిందని టిడిపి నేతలు అంటున్నారు. మొత్తానికి గ్రహణాలు తొలగిపోయి.. రోడ్డు ప్రారంభం కావడంతో రాజధాని పరిసర ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు ద్వారా అమరావతి, మంగళగిరిని అనుసంధానం చేయవచ్చు. కొండవీటి వాగు మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జి కూడా వినియోగంలోకి రావడంతో ఇక్కడ ప్రజల కష్టాలు దాదాపుగా తీరిపోయినట్టే.