Jagan Mohan Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి గైర్హాజరవుతూ వస్తోంది. ఆ పార్టీకి శాసనమండలిలో బలం ఉండడంతో అక్కడ ఉనికి చాటుకుంటూ వస్తోంది. ఎందుకంటే అక్కడ శాసనమండలి చైర్మన్ ఆ పార్టీకి చెందిన వారే. డిప్యూటీ చైర్మన్ ఆ పార్టీకి చెందిన వారే. ఆపై ఆ పార్టీకి సంఖ్యా బలం ఎక్కువ అక్కడ. అందుకే అక్కడ విపక్ష నేత పదవి సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే శాసనమండలిలో విధానపరమైన అంశాలపై ప్రభుత్వ తీరును ఎండ గడుతోంది మాత్రం ఒక మహిళా ఎమ్మెల్సీ. ఆమె పేరు వరుదు కళ్యాణి. ఇటీవల బొత్స ఎప్పటికప్పుడు అనారోగ్యానికి గురవుతుండడంతో ఆయన మార్పు అనివార్యమని ప్రచారం నడిచింది. ఆయన స్థానంలో వరుదు కళ్యాణికి అక్కడ బాధ్యతలు ఇస్తారని తెగ హడావిడి నడిచింది. కానీ బొత్స మళ్లీ యాక్టివ్ అయ్యారు. దీంతో ఆ ప్రతిపాదన మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి వరుదు కళ్యాణికి ఇచ్చే అవకాశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆమెకు ఇవ్వలేదు. దీనిపై పార్టీలోనే చర్చ నడుస్తోంది.
* మండలిలో గట్టి గళం
శాసనమండలిలో పార్టీ తరపున అత్యంత గట్టిగా గళం వినిపిస్తున్నారు వరుదు కళ్యాణి. ఆమెకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెకు ప్రాధాన్యం ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియా ఖానం పదవి విరమణ చేశారు. ఆ పదవి వరుదు కళ్యాణికి ఇస్తారని అంతా భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను విపరీతంగా ద్వేషించే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుకు ఆ పదవి ఇచ్చారు. అధికారికంగా ప్రకటన చేశారు.
* భారీ వ్యూహం..
అయితే మాధవరావు ఎంపిక వెనుక భారీ వ్యూహం ఉంది. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు కూటమి వైపు మొగ్గు చూపారు. ఓ ఆరుగురు రాజీనామా ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. చాలామంది ఇంకా పక్క చూపులు చూస్తున్నారు. ఒకవేళ టిడిపి కూటమి ప్రభుత్వం అభ్యర్థిని పెట్టి ఓటింగ్ కు వెళ్తే… కచ్చితంగా ఆయన ఓడిపోతే మాత్రం.. ఆ సామాజిక వర్గంలో టిడిపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం అని తెలుస్తోంది. అయితే తన రాజకీయం కోసం బీసీ మహిళ అయిన వరుదు కళ్యాణికి మొండి చేయి చూపడం మాత్రం పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.