Driving License : ప్రపంచంలో ఏడు వింతలు అని చదువుకున్నాం కదా.. కానీ ఇది ఎనిమిదవ వింత. ఇంతవరకు దీనిని ఎవరూ గుర్తించలేదు. గుర్తించే సాహసం చేయలేదు. సోషల్ మీడియా ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. తద్వారా ఇలా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారని ప్రపంచానికి తెలిసింది.
మనం ఏదైనా వాహనం కొనుగోలు చేసిన తర్వాత.. డ్రైవింగ్ లైసెన్స్ పొందేటప్పుడు అనేక రకాల పరీక్షలు ఎదుర్కొంటాం. ముందుగా వాహనాన్ని అధికారుల ముందు నడుపుతాం. వారు పెట్టిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేస్తాం. అప్పుడు వారు మనకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో చాలా వరకు దేశాలలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడానికి అధికారులు ఇటువంటి నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తారు.
ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రపంచం మొత్తం ఒకదారిలో వెళ్తుంటే.. ఆఫ్ఘనిస్తాన్ మరోదారిలో వెళ్తోంది. తాలిబన్ లు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నిబంధనలను పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లను జారీ చేసే విధానాన్ని విచిత్రంగా రూపొందించారు. రవాణా శాఖ అధికారి ముందుకు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అనుకునేవారు వస్తుంటారు. ఆ తర్వాత అతడు వారి దరఖాస్తులను పరిశీలిస్తాడు. ఎటువంటి వాహనం తోలుతారో ముందుగానే అడుగుతాడు. వారు టు వీల్… త్రీ వీల్.. ఫోర్ వీల్.. హెవీ ఇలా వెహికల్స్ పేరు చెప్తే.. అతడు ఆమోదిస్తాడు. గేర్లు వేయడం.. క్లచ్ ఉపయోగించడం.. బ్రేకులు వాడటం.. ఎక్సలేటర్ రేస్ చేయడం.. ఇలా ప్రతి అంశాన్ని అతడు అడుగుతాడు. కాకపోతే ఇదంతా కూడా ప్రాక్టికల్ గా ఉండదు. రవాణా శాఖ అధికారి చెప్పినప్పుడల్లా వారు గాలిలో సంకేతాలు ఇస్తుంటారు. ఆ సంకేతాలు అతడికి నచ్చితే వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఎవరైనా మంజూరు చేస్తారా.. దీనికోసం ఇలాంటి గాలి పరీక్షలు చేస్తారా.. ఇదెక్కడి విడ్డూరం.. ఒకవేళ వాహనాలు నడపడం రాకపోతే వారి పరిస్థితి ఏంటి.. రోడ్డు ప్రమాదాలకు కారణమైతే.. ఎవరు బాధ్యత తీసుకుంటారు.. అనే ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు.. డ్రైవింగ్ లైసెన్స్ ఇలా మంజూరు చేస్తే.. రవాణా శాఖ ఎందుకు.. దానికి అధికారులు ఎందుకు అని.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.