Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేశారని చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తి ముమ్మాటికి కెసిఆర్ దేనని చెబుతుంటారు. పైగా కెసిఆర్ కు
.. మల్లారెడ్డికి దగ్గర సంబంధం ఉంటుంది. గతంలో ఆయన టిడిపి నుంచి ఎంపీగా గెలిచినప్పుడు.. కెసిఆర్ సమక్షంలో గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు.
నాడు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మల్లారెడ్డి రేవంత్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. ఒక సందర్భంలో తొడ కొట్టి సవాల్ కూడా చేశారు. అనేక సందర్భాలలో టీవీ డిబేట్లలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో విమర్శలు చేసేవారు మల్లారెడ్డి. మల్లారెడ్డికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇటీవల ఆయన తిరుపతిలో కూడా తన విద్యాసంస్థలను ప్రారంభించారు. మొత్తం దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను నిర్వహించాలని మల్లారెడ్డి భావిస్తున్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీలను నెలకొల్పుతున్నారు.
ఇటీవల అందెశ్రీ సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా వచ్చారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే అదే వేదిక మీద ఉన్న మల్లారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయలేదని భారత రాష్ట్ర సమితి కార్యకర్తల ప్రధాన ఆరోపణ. అందువల్లే భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు మల్లారెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పటికీ గులాబీ పార్టీ కార్యకర్తలు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.
మల్లారెడ్డి గతంలో రేవంత్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసినప్పటికీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ మీద ఆయన ప్రేమ కనబరుస్తున్నారు. అప్పట్లో రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని కాలేజీల అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అప్పట్లో మల్లారెడ్డి బిజెపిలో చేరుతున్నట్టు వార్తలు కూడా వచ్చా యి. ఏకంగా ఆయన తన కోడలితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కొంతకాలంగా గులాబీ పార్టీ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ను రేవంత్ విమర్శిస్తున్నప్పటికీ నిశ్శబ్దంగా ఉండిపోయారు. దీనిని బట్టి మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా.. అవసరాల కోసం మౌనంగా ఉంటున్నారా.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
