Renault India : ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా శ్రీలంకకు వాహనాల ఎగుమతులను పునఃప్రారంభించింది. దీంతో శ్రీలంక మార్కెట్లో మరోసారి అడుగుపెట్టిన రెనాల్ట్.. భారత్ నుంచి వాహనాలను ఎగుమతి చేస్తున్న దేశాల సంఖ్యను 16కు పెంచుకుంది. చెన్నైలోని రెనాల్ట్ ఇండియా తయారీ కేంద్రం నుంచి తొలి విడతగా 100 ‘మేడ్ ఇన్ ఇండియా’ వాహనాలను శ్రీలంకకు పంపించింది.
ఈ తొలి షిప్‌మెంట్‌లో ఆల్-న్యూ ట్రైబర్, క్విడ్, కైగర్ మోడళ్లు ఉన్నాయి. తమిళనాడులోని ఒరగడం తయారీ ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. భారత్‌లో తయారైన వాహనాలను దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా అందించడంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తోంది.
AMW మోటార్స్‌తో భాగస్వామ్యం
శ్రీలంకలో రెనాల్ట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అక్కడి ప్రముఖ ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూటర్ AMW మోటార్స్తో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా శ్రీలంకలో రెనాల్ట్ వాణిజ్య కార్యకలాపాలను క్రమంగా విస్తరించడంతో పాటు, భవిష్యత్‌లో మరిన్ని మోడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
రెనాల్ట్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్కో హిడాల్గో మాట్లాడుతూ.. శ్రీలంకకు ఎగుమతులను పునఃప్రారంభించడం కంపెనీ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికల్లో కీలక అడుగని తెలిపారు. భారత్‌లో ఇంజినీరింగ్, తయారీ జరుగుతున్న వాహనాలకు అంతర్జాతీయంగా మరింత మార్కెట్ కల్పించడంతో పాటు, రెనాల్ట్‌కు భారత్‌ను కీలక ఎగుమతి కేంద్రంగా మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశాన్ని ఆయన వెల్లడించారు.
త్వరలో కొత్త డస్టర్
శ్రీలంకలో రెనాల్ట్ తన ఉత్పత్తుల శ్రేణిని దశలవారీగా పెంచనుంది. ఇందులో భాగంగా న్యూ డస్టర్ను కూడా అక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది. అయితే శ్రీలంకలో డస్టర్ విడుదల తేదీ, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలను రెనాల్ట్ ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతం ట్రైబర్, క్విడ్, కైగర్ మోడళ్లతో శ్రీలంకలో రెనాల్ట్ ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా సహా పలు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా భారత్ నుంచి రెనాల్ట్ వాహనాలు ఎగుమతి అవుతున్నాయి.
ఇప్పటివరకు భారత్ నుంచి దాదాపు 2 లక్షల రెనాల్ట్ వాహనాలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అయ్యాయి. శ్రీలంకలో తిరిగి ప్రవేశించడం ద్వారా భారత తయారీ కేంద్రాల అంతర్జాతీయ ప్రాధాన్యత మరింత పెరగనుంది.