పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఒక్కరోజులోనే కాంగ్రెస్ పార్టీ నియమించలేదు. టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా రోజులపాటు వేచి చూసే ధోరణి అవలంబించింది. ఆ తర్వాత సీనియర్ల నుంచి సలహాలు తీసుకొని.. అనేక రకాలుగా చర్చలు సాగించి ఆయనకు పిసిసి అధ్యక్షుడి పదవి ఇచ్చింది
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి చెప్పడంతో.. అధిష్టానం నమ్మింది. ముందు పార్టీని అధికారంలోకి తీసుకురండి.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పోస్టు అన్నట్టుగా సంకేతాలు పంపించింది. దీంతో రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని శత విధాలుగా ప్రయత్నాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ ప్రాంతంలో బహిరంగ సభ పెట్టి సంచలనం సృష్టించారు. ఇలా అనేక రకాలుగా చేసిన ప్రయత్నాలకు.. కెసిఆర్ ప్రభుత్వ ధోరణి కూడా తోడు కావడంతో ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు. ఆయన ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. అధిష్టానం ఎంపిక చేసిన ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు. రోజులపాటు చర్చలు జరిగాయి. ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. సీనియర్ నాయకుల అభిప్రాయం తీసుకున్నారు. కొందరు నాయకులు దీనికి అడ్డుపడ్డారు. ఆయనప్పటికీ కేసీ వేణుగోపాల్.. ఇంకా కొంతమంది సీనియర్ నాయకుల సపోర్ట్ ఉండడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రకమైన ప్రవర్తన ఆయనలో కనిపిస్తోంది. అందువల్లే ఆయన వచ్చే పది సంవత్సరాలపాటు తానే ముఖ్యమంత్రిని అని వ్యాఖ్యనిస్తున్నారు. కాంగ్రెస్ కల్చర్కు ఇది పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే కాంగ్రెసులో ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. ఎవరు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారు అనేది ఎవరూ చెప్పరు. ఒకరకంగా అధిష్టానం చేతిలో కీలుబొమ్మల మాదిరిగా ముఖ్యమంత్రులు ఉంటారు. గతంలో అనేక పర్యాయాలు ఇటువంటి ఉదాహరణలు జరిగాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కొత్త సిద్ధాంతాన్ని పాటిస్తుంది అని చెప్పడానికి లేదు.
రేవంత్ రెడ్డి అలా మాట్లాడటం కొంతమంది సీనియర్ నాయకులకు ఆగ్రహాన్ని కలిగించింది. వారిలో అసంతృప్తికి కారణమైంది. ఇప్పటికే మంత్రి పదవి దక్కని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీరును పరోక్షంగా ఎండ గడుతున్నారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఇక మంత్రి కొండా సురేఖ అయితే ఏకంగా ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని సరికొత్త డిమాండ్ తెరపై తీసుకొచ్చారు. కమిషన్లు తీసుకుంటున్న భట్టి విక్రమార్క.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చర్యలు ఏవి అంటూ ప్రశ్నిస్తున్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటే ముందు ఆ పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాలని సురేఖ అంటున్నారు. ఇంట్లో ఉన్న సమస్యనే రేవంత్ రెడ్డి పరిష్కరించుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ ను రాజీనామా చేయాలని ఎలా అంటారని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కెసిఆర్ కు రాజీనామా చేయడం కొత్త కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు టీఆర్ఎస్ పార్టీ ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ కు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీని ముక్కలు చేయాలని ఎంఎస్ఆర్ కు బాధ్యత అప్పగించారు. ఈ నేపథ్యంలోని ఎమ్మెస్సార్ ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పార్టీ తెలంగాణ ఉద్యమం ఊపు వల్ల గెలవలేదు.. కాంగ్రెస్ పార్టీ దయా దక్షిణ్యాల మీద గెలిచింది అని వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ లో ఆగ్రహం పెరిగిపోయింది. వెంటనే తన పదవికి రాజీనామా చేశారు.
అప్పట్లోనే ఉయ్యూరు సిటింగ్ ఎమ్మెల్యే శోభనాచలపతిరావు అనారోగ్యంతో చనిపోయారు. ఆ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. దీంతో రెండుచోట్ల ఎలాగైనా గెలవాలని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అన్ని రకాలుగా ప్రయోగాలు చేశారు. చివరికి కెసిఆర్.. ఉయ్యూరు స్థానంలో చలపతిరావు కుమారుడు విజయం సాధించారు. కెసిఆర్ తో పెట్టుకుంటే ఏమవుతుందో రాజశేఖర్ రెడ్డికి ఆరోజు అర్థమైంది. కెసిఆర్ కు రాజీనామా కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డిపోచతో సమానంగా భావించి పక్కన పడేశారు. కొన్ని ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ అంతిమంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ సంకల్పానికి జై కొట్టారు. ఇప్పుడు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆమె రాజీనామా చేస్తాను అంటున్నారు. అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఒకవేళ కెసిఆర్ కూడా రాజీనామా చేస్తే ఆ స్థానానికి కూడా ఉప ఎన్నిక వస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద సానుకూల దృక్పథం లేదు. ఇలాంటి అప్పుడు ఈ రెండు స్థానాలలో కొండా సురేఖ.. కెసిఆర్ మళ్ళీ గెలిస్తే కాంగ్రెస్ పరువు పోతుంది. అప్పుడు రేవంత్ వ్యతిరేకుల స్వరాలు పెరిగిపోతాయి. అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లిపోతాయి. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే.
ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రాన్ని చూసుకుంటే.. సిద్ధరామయ్య సీనియర్ లీడర్. ఆయనను కూడా పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కొంతమంది రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. మీరు రాజీనామా చేస్తే ఆమోదించడానికి నేను సిద్ధంగా ఉన్నానని శివకుమార్ అన్నారు. శివకుమార్ ఈ మాట అనడం వెనక అధిష్టానం సపోర్ట్ కచ్చితంగా ఉంది. కానీ అదే సపోర్టు రేవంత్ రెడ్డికి లభించడం లేదు. దీనినిబట్టి ప్రస్తుతం అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి పరపతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగ్రహంగా మాట్లాడటం వేరు. ఆలోచనతో మాట్లాడటం వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నది ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడి హోదాలో కాదు.. ముఖ్యమంత్రి హోదాలో.. ఎంత ఆలోచనతో మాట్లాడితే అంత మంచిది. లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చే పది సంవత్సరాల ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోతుంది. 30 ఏళ్లపాటు నేనే ముఖ్యమంత్రిని అని కెసిఆర్ విర్రవీగితే.. జనం పదేళ్లకే ఇంటికి పంపించారు. ఉద్యమ నేపథ్యం ఉన్న కేసీఆర్ కే ఆ పరిస్థితి ఉంటే.. రేవంత్ రెడ్డి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అర్థం చేసుకోవచ్చు.