Head Shaving Scam: లక్ష్మీ దేవత వస్తుంది. మిమ్మల్ని కరుణిస్తుంది. కోట్లు ఇస్తుంది.. దీనికోసం మీరు గుండు కొట్టించుకోవాలి.. ఇలా రవితేజ చెప్పాడో లేదో.. వెంటనే చాలామంది మహిళలు గుండు కొట్టించుకుంటారు. అయితే అతడు తనకు కొంత వాటా కావాలని అడిగితే.. ఆ మహిళలు కేవలం 1,116 లు మాత్రమే ఇస్తామని చెబుతారు. దానికి రవితేజకు కోపం వచ్చి గుండు కొట్టడాన్ని మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మిగతా గుండ్లను బ్రహ్మానందం కొడతాడు. దానికి తగ్గట్టుగానే వసూలు చేస్తాడు. ఎప్పుడో వచ్చిన విక్రమార్కుడు సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు.. అసలు దాని కథ ఏంటంటే..
నేటి కాలంలో జనాలకు ప్రభుత్వాలు ఇచ్చే పథకాల మీద.. ఉచితాల మీద విపరీతమైన ఆసక్తి. అందువల్లే పథకాలను పొందడానికి.. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకోవడానికి జనాలు ముందు వరుసలో ఉంటారు. కొందరు అర్హత లేకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళ వీక్నెస్ పాయింట్ ఇతడు కనిపెట్టాడు. అంతే తన ప్రణాళిక మొదలుపెట్టాడు.. చివరికి ఆడవాళ్ళతో కన్నీళ్లు పెట్టించాడు.
తమిళనాడు రాష్ట్రంలో పుదు కొత్త అంబడి ప్రాంతానికి చెందిన పలనియమ్మల్ అనే మహిళకు ఒక ఆకతాయి ఫోన్ చేశాడు. “కరోనా లాంటి వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండడానికి ప్రజలకు ప్రభుత్వం గుండ్లు కొట్టిస్తోంది. ముఖ్యంగా మహిళలకు గుండ్లు కొట్టిస్తోంది. ఈ విధానం ద్వారా ఒక్కొక్కరికి 15000 చొప్పున ఇస్తోంది. ఈ జాబితాలో మీదే ఫస్ట్ పేరు ఉంది. మీరు గుండు కొట్టించుకోండి” అంటూ ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని మరో ముగ్గురు మహిళలకు చెప్పింది. దీంతో వారంతా కూడా కలిసి గుండ్లు కొట్టించుకున్నారు.
గుండ్లు కొట్టించుకున్న కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ మహిళలు తమకు ఫోన్ చేసిన వ్యక్తిని సంప్రదించారు. అయితే అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాము మోసపోయామని వారు గ్రహించారు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..”ఆ వ్యక్తి మాకు ఫోన్ చేశాడు గుండ్లు కొట్టించుకుంటే డబ్బులు వస్తాయని చెప్పాడు. మేము నిజమని భావించాం. కానీ ఇదంతా మోసమని ఇప్పుడు తెలిసింది. మేము నిండా మునిగిపోయాం. అతనిపై చర్యలు తీసుకోవాలని” ఆ మహిళలు కోరుతున్నారు. కాగా ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందా..లేదా.. అనే విషయం మీద సమాచారం లేదు.