Abhijit Deepke: భారత్ ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచే వ్యూహాలను మరింత పదునుగా మార్చుకుంది. క్రీడా రంగం నుంచి సైనిక ఆపరేషన్ల వరకు ప్రతి వేదికపైనా శత్రువును కుంగదీసే తీరు కనిపిస్తోంది. ఇందులో మహిళా శక్తి కీలక పాత్ర పోషించడం మరింత గమనార్హం. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు పాకిస్తాన్ అబద్ధాలు, మత విధానాలు, ఉగ్రవాద మద్దతుపై దెబ్బ కొట్టే వ్యూహాత్మక సందేశం.
క్రీడా వేదికలపైనా ప్రతీకారం
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత ఆర్మీ బాక్సర్ జగుమని సింగ్ పాకిస్తాన్ ప్రత్యర్థిని ఊపిరి సలపని విధంగా ఓడించడం ఒక ఉదాహరణ. ప్రపంచకప్ హాకీలో కూడా భారత జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఇలాంటి విజయాలు కేవలం క్రీడా ఘనతలు కావు. శత్రు దేశంపై మానసిక ఒత్తిడి పెంచే చిన్న చిన్న దెబ్బలు. భారత్ ఈ విద్యను నెమ్మదిగా, క్రమపద్ధతిలో నేర్చుకుంటూ పరిపూర్ణం చేస్తోంది.
ఆపరేషన్ సిందూర్‌లో మహిళలు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో మీడియా సమాచారం అందించే బాధ్యతను కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లకు అప్పగించడం భారత సైనిక చరిత్రలో తొలిసారి. మహిళలు నేరుగా అప్‌డేట్‌లు ఇవ్వడం ద్వారా భారత మహిళా శక్తిని ప్రపంచానికి చూపించారు. పాకిస్తాన్‌లోని మతపరమైన విధానాలకు వ్యతిరేకంగా భారత మహిళల సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ వారు మాట్లాడారు. ఇది ఒక బలమైన రాజకీయ, సామాజిక సందేశం. తాజాగా డిస్కవరీ ఛానల్ ఆగస్టు 17న ప్రసారం చేసిన రెండు భాగాల డాక్యుమెంటరీ ఈ ఆపరేషన్ వివరాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్ చెబుతున్న అబద్ధాలను బయటపెట్టడంతో పాటు, భారత సైన్యం చేసిన ఖచ్చితమైన చర్యలను చూపించింది.
శత్రు భూమిలోకి మహిళా పైలెట్లు..
మే 7న జరిగిన దాడుల్లో భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. బహావల్‌పూర్‌లోని జైష్–ఎ–మహ్మద్, మురిడ్కేలోని లష్కర్–ఎ–తోయిబా ప్రధాన కార్యాలయాలు వీటిలో ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో మహిళా పైలెట్లు కీలక పాత్ర పోషించారు. సుఖోయ్–30, రఫేల్ వంటి యుద్ధ విమానాలను నడిపించి శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి లక్ష్యాలను ధ్వంసం చేసి తిరిగి వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆయుధాలు లోడ్ చేసే పని కూడా చేశారు. భారత వైమానిక దళ చరిత్రలో తొలిసారి మహిళలు నేరుగా యుద్ధ ఆపరేషన్‌లో పాల్గొనడం. ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన అయిదు ఆపరేషన్లలోనూ మహిళలు పాల్గొన్నారు. అడ్వాన్స్‌డ్ ఎయిర్–టు–గ్రౌండ్ మిసైల్స్ ఉపయోగించి సెకన్ల వ్యవధిలోనే వ్యూహాత్మక దాడులు చేసి విజయవంతంగా తిరిగి వచ్చారు. గతంలో సీడీఎస్ బిపిన్ రావత్ మహిళలకు కీలక బాధ్యతలు ఇస్తామని చెప్పిన మాట ఇప్పుడు అమలు రూపం తీసుకుంది.
88 గంటల్లో తోక ముడిచిన పాకిస్తాన్..
ఈ ఆపరేషన్‌లో పీవోకేలోని స్థావరాలతోపాటు పాకిస్తాన్‌లోని మూడు ప్రధాన ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేశారు. 88 గంటల్లోనే పాకిస్తాన్ చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఇందులో మహిళల పాత్ర కీలకం. దేశ రక్షణ కోసం మహిళా సైనికులు కూడా ఎంత తెగింపుతో పనిచేస్తారో ఇప్పుడు స్పష్టమైంది.
ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. పాకిస్తాన్ పుండుపై ఘాటు కారం చల్లుతూ, మహిళా శక్తిని ప్రపంచానికి చూపించే వ్యూహాత్మక విజయం. భారత్ ఇప్పుడు ప్రతి రంగంలోనూ శత్రువును ఒత్తిడికి గురిచేసే పద్ధతిని పరిపూర్ణం చేస్తోంది.