Sudigali Sudheer: ఎక్కడో విజయవాడ.. ఇంటర్ వరకే చదువుకున్నాడు. ఆర్థిక నేపథ్యం కూడా అంతంత మాత్రం. మ్యాజిక్ తెలుసు. అప్పటికే ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టేసింది. కుటుంబంలో పెద్దకొడుకుగా పుట్టాడు. బాధ్యతలు భుజాల మీద ఉన్నాయి. ప్రేమించిన అమ్మాయి తాలుకూ జ్ఞాపకాలు మనసులో భారంగా ఉన్నాయి. వీటన్నింటినీ మోస్తూ అతడు హైదరాబాదులో అడుగు పెట్టాడు. ఏం చేయాలో తెలియదు.. ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు. ఇన్నింటి మధ్య ఏదైతే అది అయిందని ప్రఖ్యాత ఆర్ ఎఫ్ సీలోకి ప్రవేశించారు.
ఉదయం నుంచి సాయంత్రం దాకా.. మ్యాజిక్ చేసేవాడు. ఆ మ్యాజిక్ లోనే తన బాధను మర్చిపోయాడు. ప్రేమించిన అమ్మాయి గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీరు పెట్టుకునేవాడు. ఆ అమ్మాయిని మర్చిపోలేక.. మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించలేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ తనను వదిలి వెళ్ళిపోయిన అమ్మాయి క్షేమంగా ఉండాలని మాత్రమే కోరుకున్నాడు. ఇలా రామోజీ ఫిలిం సిటీ లో మొదలైన అతని ప్రస్థానం.. చివరికి అదే రామోజీ ఫిలిం సిటీ లో విఐపి స్థాయి గౌరవం అందుకునే దాకా వెళ్ళింది.
ఒక మామూలు మ్యాజిక్ చేసుకునే వ్యక్తి.. టాప్ కమెడియన్గా.. టాప్ యాంకర్ గా.. బిజీ ఆర్టిస్టుగా.. అన్నిటికి మించి సోలో హీరోగా ఎదిగే స్థాయికి అతడి కెరియర్ సాగింది. వాస్తవానికి సుడిగాలి సుధీర్ స్థానంలో మరొకరు ఉంటే ఇక్కడిదాకా వచ్చేవారు కాదు. ఎందుకంటే అతడు తన కెరియ ర్ నిర్మించుకున్న తీరు, మెగాస్టార్ చిరంజీవిని గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ కాకముందు చిరంజీవి.. కెరియర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాలలో రాత్రింబవళ్లు పనిచేశారు. శరీరాన్ని తీవ్రంగా కష్టపెట్టుకున్నారు. చివరికి ఖైదీ సినిమా తర్వాత తన కెరియర్ మొత్తాన్ని మార్చేసుకున్నారు. సుడిగాలి సుధీర్ జీవితంలో కూడా ఇటువంటి పరిణామాలు అనేకం కనిపిస్తాయి.
సుడిగాలి సుధీర్ ఒకప్పుడు ₹8,000 జీతానికి పనిచేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అదే సుదీర్ మణికొండ ప్రాంతంలో అత్యంత ఖరీదైన ఏరియాలో ఇల్లు కట్టుకున్నాడు. అంతేకాదు, అనేక చోట్లలో స్థలాలు కొనుగోలు చేశాడు. ఒక నివేదిక ప్రకారం అతడు ఒక షోకు దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు తీసుకుంటాడు. సినిమాల విషయంలో కూడా దాదాపు కోటి వరకు తీసుకుంటాడు.. అతనికి బలమైన టీవీ మార్కెట్ ఉంది. అదే సమయంలో సినిమా మార్కెట్ కూడా ఉంది. అందువల్లే అతని చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఎటువంటి నేపథ్యం లేకుండా, అది కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో సోలో హీరోగా ఎదగడం అంటే అంత ఈజీ కాదు. కానీ, దానిని చేతల్లో చేసి చూపించాడు సుడిగాలి సుధీర్. ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి.. సమయం దొరికితేనే తెచ్చుకున్న క్యారేజీ విప్పుకొని తినేవాడు. కానీ ఇప్పుడు తినడానికి సమయం కూడా లేని స్థాయికి ఎదిగాడు. ఇదే అతడి రేంజ్..
యూట్యూబ్ నుంచి మొదలు పెడితే బుల్లితెర వరకు.. సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే ప్రధాన మీడియా వరకు సుడిగాలి సుధీర్ అంటే యూత్ ఆడియన్స్ కు ఒక ఎట్రాక్షన్. ఒక బలమైన ఎమోషన్.. అతను మాట మాట్లాడితే పూనకాలు వచ్చేస్తాయి. పాట పాడితే విజిల్స్ వస్తాయి. మ్యాజిక్ చేస్తే చప్పట్లు వినిపిస్తాయి. అతను ప్రేమగా ప్రపోజ్ చేస్తే అమ్మాయిల మోముల్లో సిగ్గులు విరుస్తాయి. ఒకప్పుడు ఒక అమ్మాయి తన ప్రేమను తిరస్కరిస్తే బాధపడ్డ
సుధీర్ కోసం.. ఈరోజు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఆ అమ్మాయి ఏం కోల్పోయింది.. సుధీర్ ఏం సాధించాడు.. ఈ ఒక్క ముక్కలో తేల్చేయొచ్చు. సక్సెస్ అంటే డెస్టినేషన్ కాదు. ఒక జర్నీ. దాన్ని చేసి చూపించాడు సుడిగాలి సుధీర్. కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు. నేటి యువతలో మీరు ఏ పదిమందిని పలకరించిన.. అందులో కనీసం ఒక ఆరుగురు సుధీర్ గురించి చెబుతారు. ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ.. ఎటువంటి పరిచయం లేకపోయినప్పటికీ సుధీర్ ను తమ ఇంటివాడిగా.. తమ సోదరుడిగా భావిస్తుంటారు. సుధీర్ అంటే మూడు అక్షరాలు కాదు.. అంతకుమించిన భావోద్వేగమైన బంధం. అదే అతడిని బుల్లితెరకు సూపర్ స్టార్ ను చేసింది.