WhatsApp Scam : నేటి కాలంలో ప్రతీ విషయానికి మొబైల్ తప్పనిసరిగా మారింది. అయితే ఇదే సమయంలో మొబైల్ వాడినప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల సైబర్ మోసాలకు గురవుతున్నారు. మొబైల్ లో వాడే మఖ్యమైన యాప్ వాట్సాప్. ఇందులో కొందరు లింక్స్ పంపించి వాటిని ఓపెన్ చేయించి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి సంఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వాట్సాప్ కు ఓ లింక్ రాగా.. దానిని ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయమయ్యాయి. అసలేం జరిగిందంటే?
జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌కు చెందిన ఎలిగేటి అశోక్‌కు ఇటీవల వాట్సాప్‌లో ఓ ఫైల్ వచ్చింది. దీనిని ఓపెన్ చేసి వదిలేశారు. అయితే కొద్దిసేపటికే ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా నగదు డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే అశోక్ పోలీసులను ఆశ్రయించగా.. తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించారు. దీంతో సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది వాట్సాప్ యూజ్ చేస్తున్నారు. అయితే పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే కొన్ని లింక్స్ ఓపెన్ చేయొద్దని పోలీసులు తెలుపుతున్నారు. అయితే కొన్నిసార్లు స్నేహితులు, బంధువుల పేరుతో కూడా మోసగాళ్లు ఫైల్స్ పంపించే అవకాశం ఉంది. అవతలి వ్యక్తి నిజంగా పంపించారా? లేదా? అనే విషయాన్ని ఫోన్ చేసి నిర్ధారించుకున్న తర్వాతే ఫైల్‌ను పరిశీలించాలి.
మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో మీకు ఫ్రైజ్ గెలుచుకున్నారు.. బహుమతి వచ్చింది వంటి ఫైల్స్ పంపిస్తున్నారు. ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయడం వల్ల బ్యాంక్ ఖాతాల్లోనుంచి నేరుగా డబ్బులు మాయం అయ్యే అవకాశాలున్నాయి. బ్యాంకు అధికారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు అంటూ ఎవరైనా ఫోన్ చేసినా బ్యాంకుకు సంబంధించిన పర్సనల్ వివరాలు చెప్పొద్దని, ఒకవేళ అలాంటి కాల్స్ వస్తే నేరుగా కార్యాలయానికి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే స్క్రీన్ షేరింగ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయమని ఎవరైనా చెబితే వెంటనే అప్రమత్తం కావాలి.
అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి ఇలాంటి ట్రాప్ లో పడిపోయే అవకాశం ఉంది. అయితే సైబర్ మోసానికి గురయ్యామని భావిస్తే.. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయిన వెంటనే వచ్చే మొబైల్ కు వచ్చిన మెసేజ్, ఈమెయిల్ లేదా యాప్ నోటిఫికేషన్‌లను వెంటనే సంబంధిత అధికారులకు అందించాలి. అలాగే మనం లావాదేవీ చేయకుండానే డబ్బు డెబిట్ అయినట్లు మెసేజ్ వస్తే ఆలస్యం చేయకుండా బ్యాంకును సంప్రదించి ఖాతా, కార్డులు, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలి. ఇక అలాగే భారతదేశంలో సైబర్ ఆర్థిక మోసాల కోసం 1930 హెల్ప్‌లైన్‌కు వెంటనే సమాచారం ఇవ్వడం, అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును నిలిపివేసే అవకాశం పెరుగుతుంది.