Cyber Fraud: నేటి కాలంలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలోనే చెమట చుక్క చిందకుండా డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారు. ఇందుకోసం రకరకాల దుర్మార్గాలకు.. దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరైతే ఏకంగా సైబర్ మోసగాళ్ల అవతారం ఎత్తుతున్నారు.
సైబర్ మోసగాళ్లకు డబ్బు సంపాదించడమే ధ్యేయం. అమాయకులకు ఏవేవో ఎరలు వేసి దోచుకుంటారు. అంతేకాదు, దుర్మార్గాలకు పాల్పడి ఖాతాలు మొత్తం ఖాళీ చేస్తుంటారు. సైబర్ మోసాల బారిన పడకుండా పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహనలు కల్పిస్తున్నప్పటికీ.. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త విధానాలలో మోసాలకు పాల్పడుతున్నారు.
ఏపీలోని నర్సాపురం మండలం వేముల దీవి ప్రాంతానికి చెందిన పండ్ల వ్యాపారి శాంతి బాబుకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ తెలియని నెంబర్ నుంచి వచ్చింది. అతడు ఆ ఫోన్ ఎత్తుగా అతని ఖాతా నుంచి 70000 మాయమయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అతని ఫోన్లో రెండు కొత్త యాప్స్ వచ్చేసాయి. ఆ యాప్స్ ద్వారా సైబర్ మోసగాళ్లు అతని ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తమకు నచ్చినట్టుగా చేశారు.. దీంతో శాంతి బాబు జరిగిన దారుణాన్ని మీడియా విలేకరుల ద్వారా బయటపెట్టాడు.
“నాకు ఫోన్ వచ్చింది. ట్రూ కాలర్ లో అన్ నౌన్ నెంబర్ అని పడింది. ఫోన్ లిఫ్ట్ చేశాను. ఎవరో హిందీలో మాట్లాడారు. నాకు హిందీ రాకపోవడంతో కాల్ కట్ చేశాను. వెంటనే నా ఖాతా నుంచి 70 వేలు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. ఆందోళన చెంది ఫోన్ చెక్ చేయగా రెండు ఏవేవో యాప్స్ అందులో కనిపించాయి. ఏం చేయాలో తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాను. సైబర్ మోసగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేయకుండానే డబ్బులు మాయమవుతున్నాయి. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా నష్టపోవడం బాధ కలిగిస్తోందని” శాంతి బాబు పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఎటువంటి ఓటీపీలు చెప్పమనకుండా.. ఎటువంటి లింకులు పంపకుండా ఇలా ఖాతాలను ఖాళీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో అన్ నోన్ నంబర్ల నుంచి వచ్చేకాల్స్ ఎత్తకపోవడమే మంచిదని పోలీసులు చెబుతున్నారు. అనుమానం ఉంటే వెంటనే తమకు ఫోన్ చేసి చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు.