Google Photos : స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకోవడం మాత్రమే కాకుండా.. వాటిని మరింత అందంగా మార్చుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి Google Photosను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ తన Google Photos యాప్‌కు పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫొటోల్లోని సున్నితమైన సమాచారాన్ని దాచడం నుంచి, పాతకాలపు ఫిల్మ్ లుక్ ఇవ్వడం, దుస్తులను డిజిటల్‌గా ఆర్గనైజ్ చేయడం వరకు అనేక కొత్త ఆప్షన్లు ఈ అప్‌డేట్‌లో ఉన్నాయి.
Redact పెన్‌తో సున్నితమైన సమాచారం బ్లర్
Google Photosలో అప్‌డేట్ చేసిన Markup టూల్‌లో భాగంగా కొత్తగా Redact పెన్ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో ఫొటోల్లో కనిపించే వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారాన్ని బ్లర్ చేయవచ్చు. ముఖ్యంగా ఫోన్ నంబర్లు, చిరునామాలు, ఇతర వివరాలు కనిపించే స్క్రీన్‌షాట్లు, డాక్యుమెంట్ల ఫొటోలను షేర్ చేసేటప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పెన్ మందాన్ని కూడా అవసరానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది. అలాగే ఫొటోలపై టెక్స్ట్ జోడించేందుకు కొత్త ఫాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
పాతకాలపు లుక్ ఇచ్చే Moods
Google Photosలో Moods అనే కొత్త AI ఆధారిత ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తోంది. దీని ద్వారా సాధారణ ఫొటోలకు 35mm ఫిల్మ్, 2000ల నాటి డిజిటల్ కెమెరా వంటి పాతకాలపు లుక్ ఇవ్వవచ్చు. ఫిల్టర్ ప్రభావం ఎంత ఉండాలనేది స్లైడర్ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చు. దీంతో ఫొటోలను తమకు నచ్చిన స్టైల్‌లో కస్టమైజ్ చేసుకోవచ్చు.
15 కొత్త Remix టెంప్లేట్లు
ఫొటోలను క్రియేటివ్‌గా మార్చుకునేందుకు Google Photosలో 15 కొత్త Remix టెంప్లేట్లు కూడా వస్తున్నాయి. రెడ్ కార్పెట్ తరహా చిత్రాలు, బర్త్‌డే కార్డులు, ఫొటో బూత్ స్టైల్ వంటి టెంప్లేట్లు ఇందులో ఉన్నాయి. అయితే ఇవి ఎంపిక చేసిన దేశాల్లో 18 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
AI Wardrobeతో డిజిటల్ అల్మారా
గూగుల్ తన AI Wardrobe ఫీచర్‌ను అమెరికా, భారత్, బ్రెజిల్‌లోని అర్హత కలిగిన Android, iOS వినియోగదారులకు విస్తరిస్తోంది. ఫొటోల్లో కనిపించే దుస్తులను గుర్తించి డిజిటల్ కలెక్షన్‌గా సర్దుకోవచ్చు. వివిధ దుస్తులను కలిపి కొత్త కాంబినేషన్లు రూపొందించుకోవడంతో పాటు వర్చువల్ స్టైలింగ్, కొత్త లుక్స్‌ను ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వార్డ్‌రోబ్‌కు సంబంధించిన డేటాను రిటైలర్ల వంటి థర్డ్‌పార్టీలతో షేర్ చేయబోమని గూగుల్ తెలిపింది.
Gemini Sparkతో మరింత స్మార్ట్ ఎడిటింగ్
Google Photosతో Gemini Spark ఇంటిగ్రేషన్ కూడా మరింత ఉపయోగకరంగా మారుతోంది. ఒకే ప్రాంప్ట్ ద్వారా కుటుంబ ఫొటోల్లో సరైన చిత్రాలను గుర్తించడం, వాటి బ్రైట్‌నెస్‌ను మెరుగుపరచడం, షేర్ చేయడానికి సిద్ధం చేయడం వంటి పనులను చేయవచ్చు. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం అమెరికాలోని అర్హత కలిగిన Google AI Pro, Ultra సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
మొత్తంగా చూస్తే.. ఈ కొత్త ఫీచర్లతో Google Photos కేవలం ఫొటో స్టోరేజ్ యాప్‌గా కాకుండా AI ఆధారిత ఫొటో ఎడిటింగ్, ఆర్గనైజేషన్, క్రియేటివ్ టూల్‌గా మరింత విస్తరిస్తోంది. Android, iOS వినియోగదారులకు ఫీచర్ల లభ్యత దేశం, ప్రాంతం, అర్హతను బట్టి మారవచ్చు.