iOS 27 Update : స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, కొరియర్ కంపెనీ సిబ్బంది, చివరికి మనకు తెలిసిన వ్యక్తుల పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్‌లో మాట్లాడుతూనే డబ్బులు పంపించడం, పాస్‌వర్డ్ మార్చడం, సున్నితమైన ఖాతా వివరాలను అప్‌డేట్ చేయడం వంటి చర్యలకు బాధితులను ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి యాక్టివ్ స్కామ్‌లను గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు యాపిల్ కొత్త భద్రతా ఫీచర్‌ను తీసుకొచ్చింది.
iOS 27లో ‘Impersonation Risk Detection’
యాపిల్ కొత్తగా అందిస్తున్న Impersonation Risk Detection ఫీచర్.. సోషల్ ఇంజినీరింగ్ స్కామ్‌లను గుర్తించడంపై దృష్టి పెడుతుంది. మోసగాడు బ్యాంకు, ప్రభుత్వ సంస్థ లేదా విశ్వసనీయ వ్యక్తిగా నటిస్తూ వినియోగదారుడితో ఒక ముఖ్యమైన చర్య చేయించే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. ఐఫోన్‌లోని సిస్టమ్ అనుమానాస్పద సంకేతాలను గుర్తించగలదు. ముఖ్యంగా వినియోగదారు డబ్బు చెల్లించబోతున్నప్పుడు లేదా ఖాతా పాస్‌వర్డ్ వంటి కీలకమైన భద్రతా సమాచారాన్ని మార్చబోతున్నప్పుడు ఈ రిస్క్ అసెస్‌మెంట్ ఉపయోగపడుతుంది.
మూడు స్థాయిల్లో రిస్క్ అంచనా
యాపిల్ ప్రకారం ఈ ఫీచర్ ద్వారా యాప్‌కు మూడు రకాల రిస్క్ స్థాయిల్లో ఒకటి అందుతుంది.
Unknown: అనుమానాస్పద కార్యకలాపానికి స్పష్టమైన ఆధారాలు కనిపించలేదు. అయితే దీని అర్థం ఆ చర్య పూర్తిగా సురక్షితమని మాత్రం కాదు.
Medium: కొన్ని అనుమానాస్పద సంకేతాలు గుర్తించబడ్డాయని అర్థం.
High: గణనీయమైన అనుమానాస్పద సంకేతాలు గుర్తించినప్పుడు ఈ స్థాయి కనిపిస్తుంది.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ రిస్క్ స్థాయిని రూపొందించేందుకు ఉపయోగించిన అసలు సమాచారాన్ని యాప్‌కు అందించబోమని యాపిల్ చెబుతోంది. యాప్‌కు కేవలం రిస్క్ లెవల్ మాత్రమే అందుతుంది. దాని ఆధారంగా తదుపరి చర్యను యాప్ నిర్ణయించుకోవచ్చు.
డబ్బు చెల్లింపుల సమయంలో మరింత ఉపయోగకరం
వినియోగదారు చెల్లింపు చేయడం, అకౌంట్ పాస్‌వర్డ్ మార్చడం వంటి సున్నితమైన చర్యలు చేపడుతున్నప్పుడు ఈ ఫీచర్‌ను సపోర్ట్ చేసే యాప్స్ రిస్క్ అసెస్‌మెంట్‌ను కోరవచ్చు. దీంతో మోసానికి గురయ్యే అవకాశం ఉన్న సందర్భాల్లో అదనపు హెచ్చరిక లేదా ఇతర రక్షణ చర్యలను యాప్ అమలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ ఫీచర్‌ను ఎలా ఆన్ చేయాలి?
iPhoneలో Settings ఓపెన్ చేసి Privacy & Securityలోకి వెళ్లాలి. అక్కడ Impersonation Risk Detection ఆప్షన్‌ను ఎంచుకుని Share with App Developersను ఆన్ చేయాలి. అవసరమైతే Apple Accountతో App Storeలో సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి యాప్‌కు విడిగా ఈ ఫీచర్ యాక్సెస్‌ను నియంత్రించే అవకాశం కూడా ఉంది.
అయితే ఈ ఫీచర్ అన్ని యాప్స్‌లో తప్పనిసరిగా పనిచేయదు. సంబంధిత యాప్ దీనికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిస్క్ అసెస్‌మెంట్ ఒక చర్య 100 శాతం సురక్షితమని హామీ ఇవ్వదు. అందువల్ల iOS 27లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ.. తెలియని వ్యక్తుల సూచనల మేరకు డబ్బులు పంపించడం, OTPలు లేదా పాస్‌వర్డ్‌లు పంచుకోవడం వంటి వాటిలో వినియోగదారులు ఎప్పటిలాగే జాగ్రత్తగా ఉండాల్సిందే.