Personal Finance: డబ్బును రెట్టింపు చేయాలని ఎవరికైనా ఉంటుంది. కానీ సరైన మార్గంలో పెట్టుబడి పెడితేనే మంచి లాభాలు ఉంటాయి. చాలా మంది బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చని అనుకుంటారు. కానీ దీని వల్ల అనుకున్నంత రిటర్న్స్ రావు. మన దగ్గర ఉన్న డబ్బుతో ఎక్కువ ఆదాయం కాస్త రిస్క్ తీసుకోవాలి. రిస్క్ ఎక్కువగా ఉంటే రిటర్న్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం కొన్నింటిలో డబ్బు ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. డబ్బు సేఫ్ గా ఉండాలంటేమాత్రం ఫిక్స్ డ్ డిపాజిట్ వైపు వెళ్లొచ్చు. అయితే రూ. 10 లక్షలు ఉంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఏది సరైన పెట్టుబడి? దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితె..
డబ్బును ఒకే చోట ఉంచడం కంటే వివిధ పెట్టుబడి సాధనాల్లో విభజించి పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక ఆదాయాన్నిపొందవచ్చు. ముఖ్యంగా రూ.10 లక్షలు చేతిలో ఉన్నప్పుడు మొత్తం మొత్తాన్ని ఒకే ఆప్షన్‌లో పెట్టడం కంటే బాండ్స్, గోల్డ్, ఈక్విటీ షేర్స్ వంటి విభిన్న సాధనాలను పరిశీలించడం మంచిది. అయితే ప్రతి పెట్టుబడికి రిస్క్, రాబడి, కాలపరిమితి వేర్వేరుగా ఉంటాయి.
బాండ్స్:
బాండ్స్ అంటే ప్రభుత్వం లేదా కంపెనీలు నిధులు సమీకరించేందుకు జారీ చేసే రుణ సాధనాలు. వీటిలో పెట్టుబడి పెడితే నిర్ణీత వడ్డీ లేదా కూపన్ ఆదాయం వస్తుంది. ప్రభుత్వ బాండ్స్‌లో రిస్క్ తక్కువగా ఉంటుంది. దీంతో ఇందులో రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్ కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కంపెనీ బాండ్స్‌లో మాత్రం సంస్థ ఆర్థిక పరిస్థితిని బట్టి రిస్క్ మారుతుంది. AAA కేటగిరి నుంచి B కేటగిరి వరకు వడ్డీ మారుతూ ఉంటుంది. అయితే కొన్నికంపెనీలు వడ్డీని ఎక్కువగా అందిస్తాయి. కానీ ఆ ఇన్వెస్ట్ మెంట్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
గోల్డ్:
బంగారాన్ని సంప్రదాయ పెట్టుబడిగా చాలామంది భావిస్తారు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం, మార్కెట్ అనిశ్చితి వంటి పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోకు కొంత రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించాడానికి లేదా స్పాట్ లో డబ్బు అవసరం ఉన్నవారికి ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. భారత్ లో సాంప్రదాయంగా కూడా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ రావాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చు.
ఈక్విటీ షేర్స్:
దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవాలనుకునేవారికి ఈక్విటీలు ముఖ్యమైన పెట్టుబడి సాధనం. మంచి కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడితే షేర్ ధర పెరగడం ద్వారా క్యాపిటల్ గెయిన్స్‌తో పాటు కొన్ని కంపెనీల నుంచి డివిడెండ్ ఆదాయం కూడా లభించవచ్చు. అయితే ఈక్విటీల్లో మార్కెట్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. స్వల్పకాలంలో పెట్టుబడి విలువ గణనీయంగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అత్యవసరంగా అవసరమయ్యే డబ్బును మొత్తం షేర్లలో పెట్టకూడదు. కంపెనీలను విశ్లేషించడం కష్టంగా అనిపిస్తే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు.
రూ.10 లక్షలను ఎలా విభజించుకోవచ్చు?
అయితే ఈ మొత్తాన్ని ఒకే చోట కాకుండా వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రకరకాల ఆదాయాలు వస్తుంటాయి. ఉదాహరణకు బాండ్స్ లో రూ.3 లక్షలు, గోల్డ్‌లో రూ.2 లక్షలు, ఈక్విటీల్లో రూ.5 లక్షలుగా విభజించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఒకే ఆస్తి తరగతిపై ఆధారపడే రిస్క్ తగ్గుతుంది. అయితే ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రతి వ్యక్తి ఆదాయం, వయసు, లక్ష్యాలు, అప్పులు, అత్యవసర నిధి, పెట్టుబడి కాలవ్యవధి, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి కేటాయింపు మారాలి.