Nara Lokesh: నారా లోకేష్ మీద ఇటీవల కాలంలో మాజీ ఐపీఎస్.. ఐఏఎస్ అధికారులు విమర్శలు చేస్తున్నారు. అన్ని శాఖలలో నారా లోకేష్ వేలు పెడుతున్నారని.. కనీసం ప్రభుత్వ ప్రకటనలలో సంబంధిత మంత్రుల ఫోటోలు కూడా పబ్లిష్ చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. నారా లోకేష్ సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆ మాజీ ఐపీఎస్.. ఐఏఎస్ అధికారులు ఆరోపిస్తున్నారు.
నారా లోకేష్ వేగవంతమైన పనితీరు వారికి నచ్చడం లేదు. పైగా ఆయన తనకు కేటాయించిన శాఖలలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. వాస్తవానికి కాయలు కాచిన చెట్లకు రాళ్ల దెబ్బలు పడతాయి. ఇప్పుడు నారా లోకేష్ పరిస్థితి కూడా అలానే ఉంది. వాస్తవానికి ఆ మాజీ అధికారులకు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చి ఉంటే.. గొప్పగా నారా లోకేష్ గురించి భజన చేసేవారు. నారా లోకేష్ డైనమిక్ లీడర్ అంటూ పొగిడేవారు. వారిని నారా లోకేష్ పక్కన పెట్టారు కాబట్టి విమర్శలు చేస్తున్నారు.
నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు వేగంగా సాగిపోతున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖలో కార్పొరేట్ స్థాయిని మించి ఫలితాలు వస్తున్నాయి. అలాంటప్పుడు నారా లోకేష్ పని తీరును ఆ మాజీ అధికారులు ఎలా ప్రశ్నిస్తారు.. ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది.. ఆయన శాఖలో ఏదైనా అవినీతి జరిగిందా.. పోనీ ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా.. ఆయన ఏమైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేస్తున్నారా.. ప్రభుత్వానికి నష్టం కలిగించే వ్యవహారానికి ఏదైనా పాల్పడ్డారా.. ఇలాంటివి ఏవి లేనప్పుడు ఆయనను ఎందుకు విమర్శించాలి..
ఇటీవల డీజే ల వ్యవహారంలో నారా లోకేష్ మాట్లాడిన విషయం తెలిసిందే. డీజే పెట్టుకోమన్నారు.. పోలీసులను ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. అలాంటప్పుడు హద్దులు మీరి ప్రవర్తించమని చెప్పినట్టు కాదు కదా.. విపరీతంగా సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ వేయాలని సూచించినట్టు కాదు కదా.. డీజేల వ్యవహారానికి నారా లోకేష్ కారణమని మాజీ అధికారులు చెబుతున్న తీరు చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తోంది.. వాస్తవానికి మాజీ బ్యూరోక్రాట్లు విధానపరంగా వ్యవహరించాలి. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించాలి. అలాకాకుండా వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తే.. అ మాజీ అధికారుల మీద ఉన్న ఆ కాస్త గౌరవం కూడా పోతుంది. మాజీ అధికారులకు సందు దొరకడం లేదు కాబట్టే.. నారా లోకేష్ సూపర్ సీఎం అంటూ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు.