electric scooters : భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఆగస్టు 2026లో భారీ వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు ఏకంగా 1,88,714 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఆగస్టులో నమోదైన 81,681 యూనిట్లతో పోలిస్తే ఇది 131.04 శాతం వృద్ధి. అంటే ఏడాది వ్యవధిలో 1,07,033 యూనిట్ల అదనపు విక్రయాలు జరిగాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ మాత్రమే కలిపి 95,130 యూనిట్లను విక్రయించాయి.
1. బజాజ్ చేతక్
52,248 యూనిట్ల విక్రయాలతో బజాజ్ చేతక్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2025 ఆగస్టులో 14,014 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా.. ఈ ఏడాది 272.83 శాతం వృద్ధితో అదనంగా 38,234 యూనిట్లను సాధించింది. మొత్తం మార్కెట్ వృద్ధిలో చేతక్ వాటా గణనీయంగా ఉంది.
2. టీవీఎస్ ఐక్యూబ్
42,882 యూనిట్లతో టీవీఎస్ ఐక్యూబ్ రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే సమయంలో 24,434 యూనిట్లు విక్రయించగా.. ఈసారి 75.50 శాతం వృద్ధి నమోదైంది. ఏడాది వ్యవధిలో 18,448 యూనిట్ల అదనపు అమ్మకాలు జరిగాయి.
3. హీరో విడా
హీరో విడా 25,558 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. 2025 ఆగస్టులో 12,273 యూనిట్లుగా ఉన్న విక్రయాలు ఈసారి 108.25 శాతం పెరిగాయి.
4. ఏథర్ రిజ్టా
ఏథర్ రిజ్టా 22,586 యూనిట్లతో నాలుగో స్థానాన్ని సాధించింది. గత ఏడాది 17,344 యూనిట్లతో పోలిస్తే 30.22 శాతం వృద్ధి నమోదైంది.
5. టీవీఎస్ ఆర్బిటర్
14,641 యూనిట్ల విక్రయాలతో టీవీఎస్ ఆర్బిటర్ ఐదో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో ఈ మోడల్‌కు పోల్చదగిన విక్రయాలు లేవు. ఐక్యూబ్‌తో కలిపి టీవీఎస్ ఈ జాబితాలో 57,523 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
టాప్-10లో మిగిలిన స్కూటర్లు
ఆగస్టు విక్రయాల్లో ఆంపియర్ మాగ్నస్ 9,772 యూనిట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఏథర్ 450 6,891 యూనిట్లతో ఏడో స్థానంలో, రివర్ ఇండీ 6,567 యూనిట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. రివర్ ఇండీ గత ఏడాదితో పోలిస్తే 194.62 శాతం వృద్ధి సాధించింది.
ఆంపియర్ రియో 1,911 యూనిట్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా, హోండా QC1 1,902 యూనిట్లతో టాప్-10లో పదో స్థానాన్ని దక్కించుకుంది.
టాప్-10కు వెలుపల కూడా కొన్ని మోడళ్లు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. బజాజ్ యులు 1,500 యూనిట్ల విక్రయాలతో ఏకంగా 900 శాతం వృద్ధిని సాధించింది. ఆంపియర్ నెక్సస్ 756 యూనిట్లు, సుజుకి ఈ-యాక్సెస్ 668, యమహా EC-06 475, ఏథర్ కొనార్క్ 217 యూనిట్లు విక్రయించాయి. హోండా యాక్టివా ఈ: 140 యూనిట్లతో నిలిచింది.
మొత్తంగా చూస్తే, కొత్త మోడళ్ల ప్రవేశం మార్కెట్ వృద్ధికి కొంత తోడ్పడినా.. బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా వంటి ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల పెరిగిన అమ్మకాలే ఆగస్టు 2026లో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ విస్తరణకు ప్రధాన కారణంగా నిలిచాయి.