Debt Management : ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా మారింది. ఎందుకంటే కాలం మారుతున్న కొద్ది అవసరాలు పెరిగిపోతున్నాయి. కానీ ఆదాయం మాత్రం పెరగడం లేదు. దీంతో చాలామంది అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. కొందరు ఈ ఊబిలో నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేస్తుండగా.. మరికొందరు మాత్రం అవగాహన లేకుండా మరింతగా నష్టపోతున్నారు. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని పాటించడానికి కాస్త సహనం అవసరం. అది ఉన్నవారు మాత్రమే ఇలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా బయటపడవచ్చు అని అంటున్నారు. ఇంతకీ ఆ పద్ధతులు ఏమంటే?
ఒక మధ్య తరగతి ఉద్యోగికి కనీసం నెలకు రూ. 30 వేల నుంచి 50 వేల వరకు ఆదాయం వస్తుంది. అయితే ఇది లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కు మాత్రమే. వీరు సాధారణ జీవితాన్ని గడిపిన కూడా దాదాపు ఈ ఆదాయం మొత్తం మిగలకుండా పోతుంది. అయితే అధిక డబ్బు సంపాదించడం.. లేదా కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటికోసం పయనించాలని అనుకుంటే రెండు విధానాలను పాటించాల్సి ఉంటుంది. వాటిలో
లీకేజీలు ఆపడం:
ఒక ఉద్యోగి జీతం రాగానే వెంటనే పట్టా పగ్గాలు లేకుండా ఖర్చు చేస్తుంటారు. సేవింగ్ విషయంలో పెద్దగా పట్టించుకోరు. మరికొందరు మాత్రం పూర్తిగా సేవింగ్ చేస్తూ కష్టతరమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఈ రెండు కాకుండా.. రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లాలి. అంటే ఇంట్లో అవసరాలకు.. వ్యక్తిగత అవసరాలకు తప్పనిసరి వాటికి ఖర్చులు చేయాల్సిందే. అంటే పెట్రోల్, నిత్యవసరాలు వంటివి తప్పవు. అయితే అదనపు ఖర్చులను మాత్రం ఆపాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆన్లైన్లో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం.. అవసరం లేకుండా ఆఫర్లో వచ్చిందని సినిమాల టికెట్స్ బుక్ చేసుకోవడం వంటి వాటికి కళ్లెం వేయాలి.
అదనపు ఆదాయం:
ఒకవైపు ఖర్చులకు కళ్లెం వేస్తూనే.. మరోవైపు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించాలి. నేటి కాలంలో ఒకే ఉద్యోగంపై ఆధారపడితే జీవితం గడిచేలా లేదు అని కొందరు అంటుంటారు. కానీ ఆ పరిస్థితి అందరిలోనూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు కమిషన్ బేస్డ్ ఆదాయం మార్గాలను ఎంచుకోవాలి. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ సేలింగ్ లేదా ఇతర వస్తువుల అమ్మడం ద్వారా వచ్చే కమిషన్ పొందడం. మరోవైపు స్కిల్ ఆధారితంగా సమయం దొరికినప్పుడల్లా పనిచేసే డబ్బు సంపాదించడం.
ఈ విధంగా ఒకవైపు ఖర్చులను ఆపుతూ.. మరోవైపు అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తే 30 వేల జీతం వచ్చిన వారు కూడా ఎలాంటి అప్పులు లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది.