Salary Management: చాలా మందికి జీతం రాగానే చేతిలో డబ్బులున్నాయన్న సంతోషం రెండు రోజుల్లోనే ఆవిరైపోతుంది. జీతం వచ్చిన మొదట్లో కొన్ని రోజులు సంతోషంగా ఉండి.. ఆ తరువాత జేబు ఖాళీ కావడంతో నెల మొత్తం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికను పాటిస్తే నెలంతా హ్యాపీగా గడపడమే కాకుండా, రాబోయే రోజుల్లోనూ మంచి డబ్బును ఆదా చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి. ఆవేంటంటే?
గత నెల ఖర్చు..
ఆర్థిక ప్రణాళికలో భాగంగా గడిచిన నెల ఖర్చులను విశ్లేషించడం. గత నెలలో వచ్చిన జీతాన్ని ఎక్కడ.. ఎలా ఖర్చు చేశారో ఒక్కసారి పరిశీలించాలి. అందులో అత్యవసరమైనవి ఏవి? అనవసరంగా చేసిన ‘దుబారా’ ఖర్చులు ఏవి? అనేది స్పష్టంగా గుర్తించాలి. ఉదాహరణకు అనవసరంగా చేసిన ఆన్‌లైన్ షాపింగ్స్, అవసరం లేకపోయినా ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీలు వంటివి తగ్గిస్తేనే, వచ్చే నెలలో ఎంత డబ్బు ఆదా చేయవచ్చో ఒక అంచనా వస్తుంది.
బిల్లుల చెల్లింపులు:
జీతం ఖాతాలో పడగానే ముందుగా చేయాల్సింది క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఇంటి అద్దె, ఈఎంఐలు , కరెంట్ బిల్లుల వంటి స్థిరమైన చెల్లింపులు వెంటనే చేయాలి. వీటిని వాయిదా వేస్తే పెనాల్టీలు పడటమే కాకుండా క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. కాబట్టి, వచ్చిన జీతం నుంచి ఈ చెల్లింపులన్నింటినీ ముందే పక్కన పెట్టేస్తే, మన వద్ద అసలు ఎంత సొమ్ము వాడుకకు అందుబాటులో ఉందో తెలుస్తుంది.
ఎమర్జెన్సీ ఫండ్..
కేవలం బిల్లులు చెల్లించడమే కాకుండా, భవిష్యత్తు సురక్షితంగా ఉండటానికి రెండు రకాల పొదుపులు చాలా అవసరం. ఒకటి ఎమర్జెన్సీ ఫండ్ . హఠాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు లేదా ఉద్యోగంలో ఊహించని మార్పులు వచ్చినప్పుడు ఆదుకోవడానికి కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా సొమ్మును దీనికి కేటాయించాలి.
రిటైర్మెంట్ ఫండ్..
ఎమర్జెన్సీ ఫండ్ తో పాటు రిటైర్మెంట్ ఫండ్ కూడా చాలా అవసరమే. పదవీ విరమణ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా ఉండటానికి పిపిఎఫ్ , ఎన్‌పిఎస్ లేదా మ్యూచువల్ ఫండ్లలో ఇప్పటి నుంచే చిన్న మొత్తంలో పొదుపు చేయడం ప్రారంభించాలి.
ఈ పెట్టుబడులు, ఖర్చులు పోనూ మిగిలిన దాంట్లో ఖర్చులకు ఉపయోగించాలి. అయితే ఇవి కూడా ప్రణాళిక ప్రకారంగా ఉండాలి. ఒక నెలలో మూవీ కోసం ఖర్చు చేస్తే.. మరో నెలలో రెస్టారెంట్.. ఇంకో నెలలో విహార యాత్ర. ఇలా అవసరమైన ఖర్చులు మాత్రమే చేసే జీతం వచ్చే వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు.