YV Subba Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాంతాలవారీగా సమన్వయకర్తలు ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 మంది వరకు ప్రాంతీయ సమన్వయకర్తలు ఉండగా.. ప్రధాన సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలకు సంబంధించి.. ఉత్తరాంధ్ర అత్యంత ప్రాధాన్యం అయినది. ఎందుకంటే ఇక్కడ విశాఖ అంతర్భాగం. వైసీపీ హయాంలో ఇక్కడ సమన్వయకర్తలుగా విజయసాయిరెడ్డి ఉండేవారు. అటు తర్వాత వైవి సుబ్బారెడ్డి వ్యవహరించారు. విజయసాయి రెడ్డి సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఆయన కను సన్నల్లోనే ఉత్తరాంధ్ర వ్యవహారాలు నడిచేవి. అటు తరువాత వైవి సుబ్బారెడ్డి ఉండేవారు సమన్వయకర్తగా. కానీ పార్టీ అధికారం కోల్పోయాక కురసాల కన్నబాబు సమన్వయకర్తగా నియమింపబడ్డారు. పేరుకే ఆయన కానీ బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారుతారు అన్న ప్రచారం నేపథ్యంలో.. వై వి సుబ్బారెడ్డి రీఎంట్రీ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.
* విజయసాయి రెడ్డి తర్వాత వైవి..
గతంలో వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త గా వ్యవహరించేవారు. దీంతో ఇక్కడి నేతలు ఆయనకు తెలుసు. అందుకే నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన వై వి సుబ్బారెడ్డి కి ఘనస్వాగతం లభించింది. విశాఖలో వైసీపీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దాదాపు ఉత్తరాంధ్ర కీలక నేతలంతా వచ్చి కలిసి వెళ్లారు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం కనిపించలేదు. అయితే బొత్స కు ప్రత్యామ్నాయంగా మళ్ళీ వైవి సుబ్బారెడ్డిని జగన్ రంగంలోకి దించినట్లు ప్రచారం మొదలైంది. బొత్స సత్యనారాయణ ఆయనను కలవకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం పెంచింది. కచ్చితంగా ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వై వి సుబ్బారెడ్డి నియామకం ఖాయం అని వైసిపి శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
*సుబ్బారెడ్డి సడన్ ఎంట్రీ..
వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు ఎనలేని ప్రాధాన్యం దక్కేది. దానికి కారణం విశాఖపట్నం. అప్పట్లో విశాఖను పాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేశారు. ఆ సమయంలోనే ఉత్తరాంధ్రాను బలమైన ప్రాంతంగా భావించి రీజినల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమించారు. కానీ అప్పట్లో ఆయన పెత్తనం పెరగడంతో ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు ఫిర్యాదులు చేశారు. ఆపై విజయసాయి రెడ్డి పై ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి. అందుకే పక్కకు తప్పించి వైవి సుబ్బారెడ్డిని ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్నారు బొత్స. ఎందుకంటే ఆయన విజయనగరం జిల్లాకు చెందినవారు. విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైసీపీ పక్ష నాయకుడిగా శాసనమండలిలో ఉన్నారు. అయితే ఆయన పార్టీ మారుతారు అన్న ప్రచారం నేపథ్యంలో మళ్లీ వైవి విశాఖ వైపు చూస్తున్నారు అని ఆయన పర్యటనల ద్వారా అర్థం అవుతోంది. చూడాలి చివరికి ఏం జరుగుతుందో..