Virupakshi Arrest: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. అసెంబ్లీ సచివాలయం ప్రత్యేక బులెటిన్ విడుదలైంది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ ఆ ఎమ్మెల్యే అరెస్ట్ కు సంబంధించి సమాచారం ఇచ్చారు. గత రెండు రోజులుగా కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఓ మహిళ పట్ల అనుచిత ప్రవర్తన, కుటుంబం పై దాడికి సంబంధించి విరూపాక్ష పై ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు కూడా జరిగింది. ఇదే విషయాన్ని సచివాలయం ద్వారా ధృవీకరించడం విశేషం. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది.
* ఏం జరిగిందంటే?
ఈనెల 1న ఆలూరు నియోజకవర్గ పరిధిలోని చెప్పగిరి మండలం నేమకల్లు, సంగాలకు చెందిన టిడిపి కార్యకర్తలపై ఎమ్మెల్యే విరూపాక్షి దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళపై అనుచితంగా ప్రవర్తించి… ఆమె దుస్తులను సైతం చించేసారని ఫిర్యాదు వచ్చింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఏ1 గా, మరికొందరిపై చిప్పగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తో పాటు మరో 15 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వారందరికీ రిమాండ్ విధించారు. వారందరినీ కర్నూలు సబ్ జైలుకు తరలించారు.
* సభ్యులందరికీ సమాచారం..
ఎమ్మెల్యే అరెస్టు కావడంతో సచివాలయం నుంచి ప్రత్యేక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. సభలోని సభ్యులందరికీ వివరాలు తెలియజేస్తూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ విడుదల చేశారు. కాగా ఇది ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పెట్టిన కేసు అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఇది అక్రమ అరెస్టుగా అభివర్ణించారు. మరోవైపు ఎమ్మెల్యే విరుపాక్షి పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. గొడ్డలి పార్టీ ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి దందాలను ప్రశ్నిస్తున్నారనే కారణం తోనే దాడులు చేశారని ఆరోపించారు. దళిత మహిళ దుస్తులను చింపేసిన విరూపాక్షి దుశ్యాసన పర్వాన్ని సభ్య సమాజం చీకుడుతోందన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.