Nara Lokesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో చర్చ వాడివేడిగా సాగుతోంది. అయితే శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. శాసనమండలిలో సంఖ్యా బలం ఉండడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అక్కడ అర్థవంతమైన చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ డీఎస్సీ 25 నిర్వహణపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మెగా డీఎస్సీ నిర్వహణ, ర్యాంకుల వివాదాలు, స్పోర్ట్స్ కోటా క్యాటాయింపులపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. డీఎస్సీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చిందంటూ ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ప్రశ్నాపత్రాల రూపకల్పన ప్రక్రియలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఎలాంటి సంబంధం లేదని.. ప్రభుత్వ పరీక్షల నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులే పేపర్ను తయారు చేశారని స్పష్టం చేశారు. సదరు అభ్యర్థి మొదటి ర్యాంకు సాధించినప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలనకు రాకుండా.. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ గా అనర్హుడయ్యాడని లోకేష్ సభలో వివరించారు.
* నాలుగో సారి సవాల్..
డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని.. డీఎస్సీ పై చర్చించేందుకు తాను నాలుగు సార్లు సవాల్ చేశానని.. కానీ ఆయన ముందుకు రాలేదు అంటూ జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. తనతో పాటు సీఎం చంద్రబాబును మాత్రమే కాదు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు. డీఎస్సీ తో పాటు అనేక అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. చర్చకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలంటూ జగన్మోహన్ రెడ్డికి నాలుగో సారి సవాల్ విసిరారు. స్పోర్ట్స్ కోటాలో నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందంటూ టీం 11 ప్రతినిధులు చేస్తున్న ఆరోపణలను.. ఆయన ఆధారాలతో సహా తిప్పి కొట్టారు.
* అన్నింటికీ స్పష్టత..
మెగా డీఎస్సీ భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా, నిష్పాక్షికంగా చేపడుతుంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షం అసత్య ఆరోపణలతో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ పరీక్షలకు హాజరయ్యే ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ విభాగం నుంచి తప్పనిసరిగా నిరభ్యంతర పత్రం పొందాల్సి ఉంటుందని.. కానీ మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి ఎన్ఓసీ తీసుకొని కారణంగానే అధికారిక లాగిన్లను బ్లాక్ చేసామని మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపి పాలనలో విద్యావ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని లోకేష్ గణాంకాలతో వివరించారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి వెళ్లిపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను అత్యుత్తమ బోధనా నైపుణ్యాల కోసం విదేశాలకు శిక్షణ నిమిత్తం పంపించామని గుర్తు చేశారు.. కానీ గత వైసిపి ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు కాపలాదారులుగా నిలబెట్టిందని.. ఈ అంశంపై నేషనల్ మీడియాలోనే కథనాలు వచ్చాయని గుర్తు చేశారు లోకేష్. ఓటమి వచ్చిన వెంటనే డీఎస్సీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి విప్లవాత్మక మార్పులు చుట్టిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. 148 రోజుల వ్యవధిలో డీఎస్సీ పూర్తి చేసామని.. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 141 కేసులు వేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా డీఎస్సీ నియామక ప్రక్రియను సజావుగా పూర్తి చేసిన విషయాన్ని సభలోనే వివరించే ప్రయత్నం చేశారు. సభా వేదికగా నాలుగోసారి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. ఇక తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తేల్చి చెప్పారు.
View this post on Instagram