AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజులపాటు కొనసాగనున్నాయి. అయితే ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టత వచ్చింది. శాసనసభకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం లేదు. శాసనమండలికి మాత్రం ఎమ్మెల్సీలు రానున్నారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతామని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది వైసిపి నేతలు సభకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారని.. రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని స్వయంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. సభకు హాజరు కాని వారు జీతాలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వారికి జీతభత్యాలు అందుతున్నాయని.. ఓ ఏడుగురు ఏకంగా రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని ప్రచారం నడిచింది. అయితే ఈసారి రిజిస్టర్ కాకుండా ఏఐ ఆధారిత హాజరు నిబంధన ఉండడంతో అందరి దృష్టి శాసనసభ పై పడింది.
* ప్రతిపక్ష హోదా లేక..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11చోట్ల మాత్రమే గెలిచింది. అధినేతతో కలిపి కేవలం పదిమంది గెలిచారు. అయితే నిబంధనల ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఛాన్స్ లేదు అని అధికార కూటమి చెపుతోంది. అయితే అధికార కూటమి తర్వాత మరో పార్టీ లేనందున.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసిపి పట్టుపడుతోంది. స్పీకర్ మాత్రం ప్రతిపక్ష హోదా లేదని తేల్చి చెప్పారు. సభకు వస్తే తగిన సమయం కేటాయిస్తామని చెప్పారు. అయితే ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సభలో మాట్లాడే అవకాశం రాదని.. తగిన సమయం ఇవ్వకుండా అవమానిస్తారు అంటూ వైసిపి భావిస్తోంది. అందుకే సభకు హాజరు కావడం లేదు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో గవర్నర్ ప్రసంగానికి హాజరవుతూ వస్తోంది వైసిపి.
* ఏఐ ద్వారా హాజరు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు రిజిస్టర్లో సంతకం చేసి.. జీతభత్యాలు తీసుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో దొంగ హాజరుకు చెక్ పెట్టారు. సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో స్వయంగా కూర్చుంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ కెమెరాలు.. హాజరు రికార్డు చేసేలా డిజిటల్ టెక్నాలజీ ని తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తూ.. సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంట్ పరిధిలోనే కఠిన చట్టం తేవాలని కేంద్రానికి లేఖ రాసినట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. మొత్తానికైతే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామం.