AP Assembly : ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం వేళ ఏపీ ప్రజలకు, విద్యార్థులకు ఒక అవకాశం ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి పండుగ వేళల్లో ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు అనుమతి కల్పించారు. ఈరోజు తో పాటు రేపు కూడా అసెంబ్లీ ప్రధాన గేట్లను ప్రజలందరి కోసం తెరిచి ఉంచుతారు. ఎలాంటి ముందస్తు అనుమతులు, పాస్ లు లేకుండా ఎవరైనా సరే నేరుగా వచ్చి అసెంబ్లీని తిలకించవచ్చు. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా ప్రకటన చేశారు.
* సాయంత్రం మూడు గంటలసేపు..
ఈ రెండు రోజులపాటు సాయంత్రం 6 గంటలకు రాత్రి 9 గంటల వరకు.. సాధారణ ప్రజలతో పాటు పాఠశాల విద్యార్థులు చట్టసభ లోపల, ప్రాంగణాన్ని సందర్శించే వెసులుబాటు కల్పించారు. అయితే భద్రతా నిబంధనల దృష్ట్యా అసెంబ్లీ హాలు లోపలికి మాత్రం మొబైల్ ఫోన్లను అనుమతించరని.. ప్రాంగణంలో ఫోన్లను వాడుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు. అయితే సందర్శకుల అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలను మంత్రముగ్ధులను చేసే పోలీసు బ్యాండ్ ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ఫుడ్ కోర్టులను ప్రాంగణంలో అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు.. అసెంబ్లీ సందర్శనకు రాకపోకలు సాగించేందుకు వీలుగా సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు లేఖ కూడా రాశారు.
* చట్టసభలపై ఔన్నత్యం పెంచేందుకు..
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చట్టసభలపై ప్రజల్లో ఔన్నత్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ చెప్పిన మనసభ- జనసభ నినాదానికి అనుగుణంగా.. ప్రజలను చట్టసభలకు మరింత దగ్గర చేయడమే ఈ వినూత్న ప్రయత్నం ముఖ్య ఉద్దేశం అని స్పీకర్ తెలిపారు. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభను కల్లారా చూసి.. స్వాతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. ఇంకెందుకు ఆలస్యం.. అసెంబ్లీని చూసి వద్దాం రండి..