YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా శాసనమండలిలో తన ప్రతాపం చూపుతోంది. అయితే మరో ఏడాది మాత్రమే దాని ప్రభావం శాసనమండలిలో ఉండనుంది. ఎందుకంటే శాసనమండలిలో ఆ పార్టీదే పై చేయి. శాసనసభలో కేవలం 11 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ.. శాసనమండలిలో మాత్రం కూటమికంటే బలంగా ఉంది. అయితే ఆ బలం క్రమేపి తగ్గుతోంది. మరో ఏడాదిలో దాని బలం గణనీయంగా తగ్గిపోతుంది. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్సీల పదవీ విరమణ, ఇంకోవైపు రాజీనామాలు ఆ పార్టీ బలాన్ని తగ్గించేసాయి. అయితే ఓ ఏడుగురు రాజీనామాలను శాసనమండలి చైర్మన్ ఆమోదించలేదు. అందుకే కూటమిపై పై చేయి సాధిస్తూ వస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* వైసీపీ దే బలం…
శాసనమండలిలో 58 ఎమ్మెల్సీలు ఉంటారు. అందులో నేరుగా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైన వారు ఉంటారు. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు ఉంటారు. గవర్నర్ నామినేటెడ్ చేసే ఎమ్మెల్సీలు సైతం కొనసాగుతుంటారు. ప్రస్తుతం ఉన్న బలాబలాలను పరిశీలిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33 మంది సభ్యులు ఉన్నారు. టిడిపి ఎమ్మెల్సీలుగా మరో 10 మంది కొనసాగుతున్నారు. జనసేనకు ఇద్దరు, బిజెపికి ఒకరు ఉన్నారు. పిడిఎఫ్, ఇతర కూటమి అభ్యర్థులు మరో ఐదుగురు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. అయితే మరో ఏడాదిలో శాసనమండలి టిడిపి కూటమికి చిక్కడం ఖాయం. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఏ క్షణమైనా శాసనమండలి టిడిపి కూటమికి చిక్కే ఛాన్స్ కనిపిస్తోంది.
*+ఆమోదం పొందని రాజీనామాలు..
చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉంటూనే కూటమితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది అయితే రాజీనామా కూడా చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, జయ మంగళం వెంకట్ రమణ ఇలా వీరంతా రాజీనామా చేశారు. కానీ వీరి రాజీనామాలను ఆమోదించలేదు శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోతుందన్న ఆలోచనతోనే వీరి రాజీనామాలను ఆమోదించలేదు. వీరి రాజీనామాలను ఆమోదించిన మరుక్షణం ఖాళీ అయిన పదవులన్నీ టిడిపి కూటమి ఖాతాలో పడతాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పడిపోయి కూటమి బలం పెరగనుంది. అమరుక్షణం శాసనమండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి దించేస్తారు. అందుకే రాజీనామాలను ఆమోదించలేదు.
* చైర్మన్ పై అవిశ్వాసం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్సీలు వచ్చే ఏడాదిలోపు పదవీ విరమణ చేస్తారు. అలా చేసిన మరుక్షణం శాసనమండలిలో ఆ పార్టీ బలం తగ్గిపోతుంది. 2028లో శాసనమండలి చైర్మన్ రాజు ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన వైసీపీ హై కమాండ్ ఆదేశాలను అనుసారం పనిచేస్తున్నారన్న విమర్శ ఉంది. అందుకే మండలిలో వైసిపి బలం తగ్గిన మరుక్షణం ఆయన పై అవిశ్వాసం పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.