YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాంతం రాయలసీమ. అటువంటి ప్రాంతంలో మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కడప జిల్లాలో సైతం కూటమిదే ఆధిపత్యం. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి గెలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే కడప పార్లమెంటు స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడం ఆ పార్టీకి కొంత ఉపశమనం. కానీ ఈసారి కడప సీటు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోనుందని ఓ సంచలన సర్వే వెల్లడించింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కడప ఎంపీ సీటు టిడిపి ఖాతాలో పడుతుంది అనేది ఆ సర్వే సారాంశం. తాజాగా ఇండియా టుడే, సి ఓటర్ సంస్థ చేసిన సర్వేలో ఏపీలో కూటమిదే అధికారం అని తేలిపోయింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మెరుగుపరచుకొని ఐదు పార్లమెంట్ సీట్లను గెలుచుకుంటుందని.. కూటమి 20 స్థానాలతో హవా కొనసాగిస్తుందని ఈ సర్వే తేల్చడం విశేషం. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలం అని పరిగణిస్తున్న కడప పార్లమెంట్ సీటు ఈసారి ఆ పార్టీ నుంచి చేజారడం ఖాయమని కూడా తెలుస్తోంది.
* బిజెపికి తగ్గనున్న రెండు సీట్లు..
జాతీయస్థాయిలో ఇండియా టుడే- సి ఓటరు సంస్థ చేపట్టిన సర్వేలో.. ఏపీలో సైతం బిజెపికి రెండు స్థానాలు తగ్గుతాయని.. టిడిపికి ఇప్పుడున్న 16 స్థానాలకు తోడు మరో రెండు సీట్లు పెరిగి 18 కి చేరుతాయని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం. అన్నింటికీ మించి కడప పార్లమెంటు సీటు వైసీపీ నుంచి చేజారి పోతుందని తేల్చడం మాత్రం సంచలనంగా మారింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కడప ప్రజల మూడ్ మారిందని.. జిల్లా ప్రజలు ఈసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని కూడా తేల్చి చెప్పడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నింపుతోంది.
* కష్టమేమీ కాదు..
వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లోనే తక్కువ ఓట్లతో బయటపడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి మెజారిటీ గణనీయంగా తగ్గిపోయింది. లక్షల్లో ఉండే మెజారిటీ వేలకు పడిపోయింది. ముగ్గురు అభ్యర్థులు అక్కడ బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి ఉండగా.. టిడిపి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల రంగంలోకి దిగారు. త్రిముఖ పోటీలో స్వల్ప ఓట్ల మెజారిటీతోనే అవినాష్ రెడ్డి బయటపడ్డారు. కానీ ఈసారి మాత్రం వైసీపీ కడప ఎంపీ సీటు కోల్పోతుందని తెలియడం మాత్రం ఆ పార్టీ శ్రేణులకు నిద్ర పట్టనివ్వడం లేదు.
* ఆ కారణాలతోనే..
కడప ఎంపీ సీటు వైసీపీ కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వైయస్ కుటుంబంలో చీలిక. ఆ కుటుంబంలో అడ్డగోలు చీలిక వచ్చింది. దీంతో ఆ కుటుంబ బలం తగ్గి ఆ ప్రభావం రాజకీయంగా కూడా మారింది. వివేకానంద రెడ్డి హత్య అంశం కూడా విశేష ప్రభావం చూపుతోంది. సొంత మనుషులే ఆయనను పొట్టన పెట్టుకున్నారు అని జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు కడప జిల్లాలో ఎన్నడూ లేని అభివృద్ధి కొనసాగుతోంది. చివరకు పులివెందుల నియోజకవర్గం వర్గానికి సైతం ఎన్నెన్నో ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చారు. అభివృద్ధితో రాజకీయ అభిమానం తగ్గుతోంది కడప జిల్లాలో. మరోసారి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి త్రిముఖ పోటీ నెలకొంటే.. కచ్చితంగా కడప పార్లమెంట్ సీటు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం ఖాయం.