YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వై నాట్ కుప్పం అనే నినాదం బలంగా వినిపించింది. స్వయంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నినాదాన్ని పలుమార్లు అందుకున్నారు కూడా. వై నాట్ 175 లో భాగంగానే వై నాట్ కుప్పం అన్న స్లోగన్ బలంగా నడిచింది.. దీంతో చంద్రబాబు కూడా జాగ్రత్త పడ్డారు. 2019 ఎన్నికల ప్రభావం ఆయనపై పడింది. ఆ పై స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. దీంతో కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారు అంటూ ప్రచారం చేయడం ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి మంత్రి కొడాలి నాని అయితే చంద్రబాబు ఓడిపోకపోతే ఆయన బూట్లు తుడుస్తా అంటూ నోరు జారే సారు కూడా. అయితే వారు ఒకటి అనుకుంటే ప్రజలు మరోలా తలిచారు. రికార్డ్ స్థాయిలో చంద్రబాబును గెలిపించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువుదీరారు బాబు. అయితే ఏ కుప్పంలో అయితే సవాల్ చేశారో.. ఏ కుప్పంలో అయితే గెలుపొందుతాం అని చెప్పుకొచ్చారో.. అదే కుప్పంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు చేసేందుకు ఒక్క వైసీపీ నేత కూడా రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
* అప్పట్లో పెద్దిరెడ్డి హడావిడి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తన సొంత నియోజకవర్గం పుంగనూరును విడిచి పెట్టేసారు సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పూర్తిగా కుప్పం నియోజకవర్గం పైనే దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గానికి చెందిన యువనేత భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు. ఒక అధికార కేంద్రంగా కూడా మార్చారు. ఒకానొక దశలో చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. అంతలా అక్కడ ఆయనపై ఎదురుదాడి జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ ఏకపక్షంగా గెలుచుకున్నారు. దీంతో మరింత విజయంపై నమ్మకం కుదిరింది. దానితోనే విపరీతంగా రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు అదే నియోజకవర్గంలో కనీసం మాట్లాడేందుకు కూడా నేతలు ముందుకు రాని పరిస్థితి.
* ముఖం చూడని బడా నేతలు..
దగా డిఎస్సి అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. డీఎస్సీ 2025లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆందోళన చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇంట్లోనే నిరసన తెలిపారు. అయితే ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గస్థాయి నాయకుడు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎనలేని సహకారం అందేది బడా నేతల నుంచి. కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కుప్పం వైపు చూడడం లేదు. ఆ సాహసం కూడా చేయడం లేదు. వై నాట్ కుప్పం అని చేతులు కాల్చుకున్నాక.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అసలు తత్వం బోధపడినట్లు అయింది. అందుకే ఆ నియోజకవర్గ జోలికి వచ్చేందుకు సాహసించడం లేదు.