YS Sunitha : దేశంలోనే అత్యంత హై ప్రొఫైల్ కేసు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడిగా, ఒక మాజీ మంత్రిగా, అప్పటి ప్రతిపక్ష నేత సొంత బాబాయి గా హత్యకు గురైన వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఇప్పటికీ న్యాయం జరగకపోవడం అనేది ఆందోళన కలిగించే అంశం. తండ్రి హత్య పై సుదీర్ఘకాలం పోరాడుతూ వచ్చారు ఆయన కుమార్తె సునీత. ఇప్పటికీ న్యాయం జరగకపోవడంతో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ కేసు విచారణలో సీబీఐ సరిగ్గా వ్యవహరించలేదని.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేదని.. అసలైన నిందితులను గుర్తించలేదని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి స్పందించి న్యాయం చేయాలని కోరారు.
* ఏడేళ్లుగా న్యాయ పోరాటం..
ఏడేళ్లుగా వైయస్ సునీత తన తండ్రి హత్య కేసు కు సంబంధించి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు రెండు ప్రభుత్వాలు మారిపోయాయి కానీ ఆమెకు న్యాయం జరగడం లేదు. ప్రధానంగా ఆమె ఒకే అంశం ప్రస్తావిస్తున్నారు. తన తండ్రి హత్య జరిగిన విషయం ఇంట్లో వారికి.. ఇంట్లో పని చేస్తున్న వారికి కాకుండా.. జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది అనేది ఆమె వాదన. కచ్చితంగా ఇది రాజకీయ ప్రేరేపిత హత్యగా ఆమె భావిస్తున్నారు. అందుకే చివరి వరకు న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. కానీ అనుకున్న విధంగా సాగకపోవడంతో ఇప్పుడు రాష్ట్రపతిని ఆశ్రయించారు.
* రకరకాలుగా చిత్రీకరించి..
2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వైయస్ వివేకానంద రెడ్డి. తొలుత ఆత్మహత్యగా చిత్రీకరించారు వాళ్లే. తరువాత హత్యగా చెప్పుకొచ్చారు వాళ్లే. అప్పటి టిడిపి ప్రభుత్వం పై నిందలు వేసింది వాళ్లే. వైసిపి అనుకూల మీడియా సాక్షి లో అయితే నారాసుర రక్త చరిత్ర అంటూ.. చంద్రబాబు దగ్గరుండి ఈ హత్య చేయించినట్టు కథనాలు వండి వార్చారు. రాజకీయంగా కూడా ఈ హత్యను సానుభూతిగా మార్చుకున్నారు. అప్పటివరకు సిబిఐ దర్యాప్తును కోరిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదన్నట్టు మాట్లాడారు. అప్పటినుంచి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సిబిఐ దర్యాప్తు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సునీత మాత్రం ఒక్క అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. లోకానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసినట్టు? ఈ హత్య వెనుక వందల కోట్ల రూపాయలు చేతులు మారి సాక్షాలు చెరిపేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
* రాజకీయంగా డ్యామేజ్
వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడకపోవచ్చు కానీ.. రాజకీయంగా ఎప్పుడో శిక్ష పడింది. 2019లో వివేకానంద రెడ్డి హత్య సానుభూతి లభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. ప్రధానంగా కడప జిల్లాతో పాటు రాయలసీమలో స్పష్టమైన ప్రభావం కనిపించింది. మరోవైపు కుటుంబం సైతం జగన్మోహన్ రెడ్డికి దూరమైంది. గతం మాదిరిగా పట్టు కోల్పోయారు సొంత ప్రాంతం పై. ఈ ఎన్నికల వరకు సునీత ఇదే మాదిరిగా పోరాటం చేస్తే మాత్రం.. మరోసారి రాజకీయంగా ఇబ్బందులు తప్పవు జగన్మోహన్ రెడ్డికి..