YS Jagan Padayatra: ప్రతిపక్షం అంటే జనాల్లో ఉండాలి. జనంతో మమేకం కావాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. కానీ తాను మాత్రం ఆ పని చేయనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయిందని.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు పార్టీ శ్రేణులకు. రెండేళ్ల సమయం దాటిపోయింది. ఇంకా మూడేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ఏడాదిన్నర కాలంలో పాదయాత్ర ప్రారంభం అవుతుంది అని చెబుతున్నారు. అంటే 2029 వేసవిలో ఎన్నికలు ఉండగా.. చివరి ఏడాది 2028 లో పాదయాత్ర ఉంటుందని తాజాగా ఏంటి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే 2027 ద్వితీయార్థంలో పాదయాత్ర అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు షాక్ తప్పడం లేదు.
* చివరి ఏడాదిలో వస్తారట..
2019 ఎన్నికలకు ముందు అంటే 2017లో పాదయాత్ర మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అలా కాదు. చివరి ఏడాదిన్నర ఉందనగా పాదయాత్ర మొదలు పెడతానని చెబుతున్నారు. అప్పటివరకు మీరే ప్రజా పోరాటాలు చేయండి అని బదులిస్తున్నారు. అంటే ఇప్పట్లో పాదయాత్ర ఉండదు అని సంకేతాలు పంపుతున్నారు. తాను రెస్ట్ మోడ్ లో ఉంటానని.. బెంగళూరు నుంచి తాడేపల్లికి షటిల్ సర్వీస్ తప్పదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు జిల్లాల పర్యటన పై కానీ.. పార్టీ ప్లీనరీ గురించి కానీ ఆయన ప్రస్తావించడం లేదు. కేవలం కూటమి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను బలంగా నమ్ముతున్నారు. ప్రజల్లో బలమైన వ్యతిరేకత కూటమిపై ఉందని చెబుతున్నారు. కూటమిపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉన్నందున తన అవసరం ఇప్పుడే రాదని.. చివరి నిమిషంలో తాను వస్తే చాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
* జిల్లాల పర్యటనలేవి?
ఎప్పుడో 2025 సంక్రాంతి ముందే జిల్లాల పర్యటన అని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ జిల్లాల పర్యటన మాట లేదు. కనీసం ఆ ప్రస్తావన కూడా లేదు. అలా ప్రకటించి ఏడాదిన్నర అవుతోంది. పార్టీ క్యాడర్ మాత్రం కళ్ళు కాయలు కాచేలా చూస్తోంది. కానీ ఇంతవరకు ఆయన వచ్చింది లేదు. 2027 ద్వితీయార్థంలో పార్టీ ప్లీనరీ, ఆపై పాదయాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు ఎంతో ఆశలు పెట్టుకున్నాయి. కానీ అంత సీన్ లేదు. చివరి ఏడాది మాత్రమే తాను సీన్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. కూటమి పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళండి.. నేను క్లైమాక్స్ లో వచ్చి కలుస్తా అని బదులిస్తున్నారు. అయితే అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకు కూడా తెలుసు. అందుకే కక్కలేక మింగలేక వారు బాధపడుతున్నారు.
