Andhra Pradesh Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరోసారి క్లారిటీ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీలతో పాటు మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ సైతం సన్నాహాలు చేసింది. సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. అయితే హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బీసీ గణన పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఒక పిటిషన్ దాఖలు అయింది కోర్టులో. పాలకవర్గాల గడువు ముగిసిన నేపథ్యంలో తక్షణం ఎన్నికల నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని మరో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన క్రమంలో ప్రభుత్వం తరపు న్యాయవాది ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కుటుంబాల సర్వే తో పాటు బీసీ రిజర్వేషన్ అధ్యయన కమిటీ నివేదిక వస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.
* పంచాయతీలకు ప్రత్యేక అధికారులు..
రాష్ట్రంలో 13 వేల పంచాయితీలకు పైగా పాలకవర్గాల పదవీకాలం గడువు ఏప్రిల్ 4 తో ముగిసింది. దీంతో పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. వీలైనంత త్వరగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే రాజ్యాంగబద్ధమైన ఆర్థిక సంఘం నిధులు కేటాయించే పరిస్థితి ఉంది. ఇటీవల 16వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఏపీకి కేంద్ర ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు చేసింది. గత 15వ ఆర్థిక సంఘం కంటే దాదాపు ఓ నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు కేటాయింపులు జరిపింది. అయితే పాలకవర్గాలు ఉంటేనే ఈ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుకు అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు సంబంధించిన పాలకవర్గాల పదవీకాలం గడువు మార్చి 17 తో ముగిసింది. వాటికి సైతం ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు.
* ఆ ప్రక్రియలు అన్నీ కొలిక్కి
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్థానిక సంస్థలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ వచ్చింది. బీసీ గణన చేపట్టిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కొంతమంది కోరుతూ వచ్చారు. అటువంటి వారి తరఫున ఒక న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు పంచాయతీలకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు అయింది. ఈ రెండు పిటీషన్లు విచారణకు వచ్చిన క్రమంలో.. కుటుంబాల సమగ్ర సర్వే, బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ అధ్యయనం తుది దశకు చేరుకుంది. అందుకే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రక్రియలన్నీ ముగిసిన వెంటనే రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
