Chandrababu: ఏపీలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల ఎంపిక జరిగింది. సీఎం చంద్రబాబు ఊహించని ఎంపిక చేశారు. పార్టీలో సుదీర్ఘకాలం సేవలు అందిస్తున్న సీనియర్ నేతకు ఒకవైపు.. ఏరి కోరి సామాన్య మహిళకు మరోవైపు ఛాన్స్ కల్పించారు. గత నెల 28న గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జాఖియా ఖానం, పండు రవీంద్ర బాబు పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది. ప్రభుత్వ సిఫార్సులు మేరకు గవర్నర్ నామినేట్ చేస్తారు. అయితే ఈ పదవులకు ఎట్టకేలకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు సీఎం చంద్రబాబు. పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య పేరును ఖరారు చేశారు. మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన ఒక సాధారణ మహిళను ఎంపిక చేయడం విశేషం. ఎంతోమంది సీనియర్లు ఆశావహులుగా ఉన్నారు. కానీ వారందరినీ కాదని సామాన్య అంగన్వాడీ కార్యకర్తకు అవకాశం కల్పించారు.
* ఆశావాహులు అధికం..
వాస్తవానికి 2024లో పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన చాలామంది నేతలు ఉన్నారు. వారందరికీ అప్పట్లో ఎమ్మెల్సీ పదవుల హామీ ఇచ్చారు. అందుకే గవర్నర్ కోటా లో పార్టీ సీనియర్లకు అవకాశం వస్తుందని అంతా భావించారు. గతంలో రాజ్యసభ ఎంపికలో వర్ల రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. గతంలో ఆయన ఓడిపోతానని తెలిసి కూడా రాజ్యసభకు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టిడిపి వాయిస్ వినిపించడంలో ముందుండే వారు రామయ్య. గతంలో పోలీస్ శాఖలో పనిచేసిన అనుభవం ఉండడంతో అప్పటి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసేవారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం వర్ల రామయ్య పేరును ఎమ్మెల్సీగా ఖరారు చేశారు చంద్రబాబు.
* సాధారణ బీసీ మహిళ..
మరోవైపు రెండో ఎమ్మెల్సీ పదవిని రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ మహిళను ఎంపిక చేశారు. అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సామాజిక సమతూల్యతను పాటిస్తూ.. ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యమిచ్చినట్లు అయింది. వర్ల రామయ్య పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. గతంలో ఆర్టీసీ చైర్మన్గా కూడా పనిచేశారు. వర్ల రామయ్య తో పాటు సాధారణ మహిళకు ఈసారి అవకాశం దక్కింది. ఈ రెండు పేర్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. అయితే పార్టీలో చాలామంది సీనియర్లు ఆశావహులుగా ఉన్నారు. పదిమంది వరకు పదవుల కోసం వేచి చూస్తున్నారు. వారందరినీ కాదని ఈ ఇద్దరి ఎంపిక అనూహ్యం అని అర్థం అవుతోంది.