YouTube Views: ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద దృశ్యమాధ్యమంగా పేరు తెచ్చుకుంది యూట్యూబ్. కంటెంట్ క్రియేటర్లు పెరిగిపోవడం.. కంటెంట్ నాణ్యతకు యూట్యూబ్ పెద్దపీట వేయడంతో ఇటీవల కాలంలో కొత్త కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది యూట్యూబ్ యాజమాన్యం.
ఈనెల 24వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త మార్పును తీసుకువస్తామని యూట్యూబ్ యాజమాన్యం ప్రకటించింది. దీని ప్రకారం యూట్యూబ్ తన వ్యూ కౌంటింగ్ విధానంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. దీని ప్రకారం ఇకపై యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే అయితే.. అది ప్రారంభమైన మరుక్షణమే ఒక వ్యూగా లెక్కిస్తారు. ఇప్పటివరకు ఒక సాధారణ వీడియోను కనీసం 30 సెకండ్ల పాటు చూస్తేనే ఒక వ్యూ గా లెక్కించేవారు. ఇకపై ఆ విధానానికి యూట్యూబ్ యాజమాన్యం స్వస్తి పలకబోతోంది.
వీడియోను ప్రేక్షకులు ఎంతసేపు చూశారు అనే దానితో సంబంధం లేకుండా.. అది ప్లే అయితే చాలు.. వ్యూ కౌంట్ మొదలవుతుంది. గత ఏడాది షార్ట్స్ కు మాత్రమే ఈ విధానం అమల్లో ఉండేది. ఇప్పుడు పెద్ద వీడియోలకు.. లైవ్ స్ట్రీమ్ కు కూడా ఇది వర్తించబోతోంది. దీని ప్రకారం క్రియేటర్ల వీడియోల పబ్లిక్ వ్యూ కౌంట్ గతంతో పోల్చి చూస్తే వేగంగా పెరిగే అవకాశం ఉంది. వీడియో ప్లే అయిన తర్వాత ఎంతమంది ప్రేక్షకులు దానిని నిజంగానే చూశారు అనే విధానాన్ని అనలిటిక్స్ లో ప్రత్యేకంగా యూట్యూబ్ యాజమాన్యం అందుబాటులో ఉంచుతుంది.
తాజా నిబంధన ప్రకారం క్రియేటర్ల సంపాదన లేదా యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రాం మీద ఎటువంటి ప్రభావం కనిపించదు. మరోవైపు ఛానల్ మానిటైజేషన్ విషయంలో ఇకపై వ్యాలీడ్ పబ్లిక్ వ్యూస్ స్థానంలో క్వాలిఫైడ్ షాట్స్ వ్యూస్, క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ అనే నూతన విధానాలను యూట్యూబ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల వల్ల ప్లాట్ ఫామ్ లో కంటెంట్ కు వస్తున్న అసలైన రీచ్, ఎక్స్పోజర్ ను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. వీక్షకుల సంఖ్య పెరగడం వల్ల బ్రాండ్ పార్ట్నర్స్.. స్పాన్సర్లకు ఛానల్ నిజమైన స్కేల్ తెలుస్తుంది. దీనివల్ల అత్యంత సులభంగా డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్.. టిక్ టాక్ మాదిరిగానే యూట్యూబ్ కూడా వ్యూస్ లెక్కించడం వల్ల.. మిగతా వాటితో యూట్యూబ్ పరిధిలో పోల్చడం ఈజీ అవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్లు పెరిగిపోతున్నారు. దీనికి తోడు కొంతకాలంగా వీడియోలలో క్వాలిటీ లేకుండా పోతోందని యూట్యూబ్ యాజమాన్యం ఇటీవల గుర్తించింది. అందువల్లే ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పుల వల్ల కంటెంట్ క్రియేటర్లలో పోటీ తత్వం పెరుగుతుందని.. ఆదాయం దండిగా పెంచుకోవడానికి మార్గం ఏర్పడుతుందని యూట్యూబ్ యాజమాన్యం అంచనా వేస్తోంది. కాకపోతే కొత్త నిబంధనలు యూట్యూబ్ కే అనుకూలంగా ఉన్నాయని.. కంటెంట్ క్రియేటర్లు పెరిగినప్పటికీ మానిటైజేషన్ నిబంధనలు కఠినంగా ఉండడంవల్ల యూట్యూబ్ సొమ్ము చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.