Vijaya Sai Reddy: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆయన ఆగస్టు 15న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తప్పకుండా ఆ ప్రభావం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు విజయసాయిరెడ్డి. అందుకే ఆ పార్టీ నుంచి చేరికలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి.. రాయలసీమ నుంచి ఈ చేరికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. పూర్తి హిందుత్వ వాదంతో.. భారతీయ జనతా పార్టీకి దగ్గరగా భావజాలం ఉండేలా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఉండబోతుందన్న చర్చ నడుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి పార్టీలో కూటమి నుంచి చేరికలు అంత ఉండవు. వైసీపీని విభేదించేవారు.. తప్పనిసరి పరిస్థితుల్లో కూటమిలో చేరిన వారు తిరిగి విజయసాయిరెడ్డి పార్టీ వైపు చూసే ఛాన్స్ ఉంది. సామాజిక వర్గపరంగా కూడా కొంతమంది అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి.. విశాఖ జిల్లా నుంచి ఎక్కువగా చేరికలు ఉంటాయని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఎందుకంటే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా పనిచేశారు విజయసాయిరెడ్డి. ఆ సమయంలో విశాఖలో ఎక్కువ కాలం గడిపారు. అక్కడి నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.
* కొత్త నేతలకు వేదిక..
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ చాలామంది నేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించే వేదిక కానుంది. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో నేతలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా నేతలు కొత్త పార్టీ వైపు వచ్చే ఛాన్స్ లేదు. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం కొంతవరకు పార్టీ మారే సూచన ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గస్థాయి నాయకులుగా ప్రమోట్ అయ్యేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. అటువంటి వారిపై విజయసాయిరెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. కేవలం కూటమి పార్టీల్లో చేరలేక.. చేరే అవకాశం చిక్కక విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. కానీ ఇప్పటికిప్పుడు పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి రావడం.. ప్రతిపక్ష పాత్ర పోషించడం కుదిరే పని కాదు. అటువంటప్పుడు ఆ పార్టీలో ఎవరు చేరుతారు అనేది ఒక ప్రశ్న.
* ఆ ప్రాంతాల్లో ప్రభావం..
ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం.. కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం.. రాయలసీమలో ఒక సామాజిక వర్గం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి.. కూటమిని వ్యతిరేకించే వర్గాలు కచ్చితంగా విజయసాయిరెడ్డి పార్టీని ఆశ్రయిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. దానికి కారణాలు లేకపోలేదు. కూటమి పార్టీల్లో ఇప్పటికీ అవకాశం దక్కని చాలామంది నేతలు ఉన్నారు. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నేతలు ఏ పార్టీలో చేరేందుకు అవకాశం లేదు. అటువంటి వారంతా విజయసాయిరెడ్డి పార్టీని ఆశ్రయించే అవకాశం ఉంది. చూడాలి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఎంతవరకు ప్రభావం చూపుతుందో..