Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి.. దసరా దాకా సస్పెన్స్ థ్రిల్లర్.. అప్పుడే రిలీజ్..చెప్పిన సమయానికి.. అనుకున్న వేదిక వద్దకు విజయసాయిరెడ్డి వచ్చారు. కొద్దిరోజులుగా ఆయన సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు తగ్గట్టుగానే.. సుదీర్ఘంగా మాట్లాడారు. వచ్చిన విలేకరులకు తాగడానికి అల్లం టీ.. స్నాక్స్.. మంచి భోజనం పెట్టారు. కానీ.. తన స్క్రిప్ట్ ప్రకారం సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగించారు.
సుదీర్ఘంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి పార్టీ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటివరకు రెడ్లు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే పరిపాలించారని చెప్పారు. అంతేకాదు, తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీలో సింహభాగం స్థానాలు జన్ జెడ్ కు కేటాయిస్తామని చెప్పారు. అక్కడితోనే ఆగిపోలేదు.. దసరాకు తాను ఏర్పాటు చేయబోయే పార్టీ గురించి ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంతేకాదు.. తాను ఏర్పాటు చేయబోయే పార్టీ అధికారంలోకి గనుక వస్తే.. తాను ముఖ్యమంత్రి పదవి తీసుకోనని.. మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్ థాక్రే మాదిరిగా పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చారు.
విజయసాయిరెడ్డి జగన్ నుంచి దూరం జరిగిన తర్వాత ప్రజాస్వామ్య యుతంగా మాట్లాడుతున్నారు. గడిచిన ఏడాదికాలంగా ఆయన పరిశోధన చేశారట. కాపు కులం నుంచి రెడ్లు ఏ విధంగా వేరుపడ్డారు.. దానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఒక పుస్తకాన్ని రాశారట. ఏపీ రాష్ట్రాన్ని ఇప్పటివరకు రెడ్లు.. కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారు మాత్రమే పరిపాలించారని.. మిగతా సామాజిక వర్గాలు ఎందుకు పరిపాలించకూడదని ప్రశ్నించడం విజయసాయిరెడ్డి.. కేవలం రెడ్ల గురించి మాత్రమే పరిశోధన చేయడమేంటి.. పుస్తకం రాయడం ఏంటి.. పైగా పార్టీని ఏర్పాటు చేయబోతున్న ఈ సమయంలో దాని ప్రస్తావన ఎందుకు…
ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 1500 టీఎంసీల నీళ్లు అవసరమని.. ప్రస్తుతం 1100 టిఎంసిల నీళ్లు మాత్రమే ఉన్నాయని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఏం చేశారు.. అప్పట్లో పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి హైజాక్ చేయలేదు కదా. అప్పుడు విజయసాయిరెడ్డి ఎంత చెబితే జగన్ కు అంత కదా.. అప్పుడు విజయసాయి రెడ్డి ఏం చేశారు.. ఇప్పుడు ప్రాధాన్యం తగ్గింది.. అందువల్లే ఏపీ ప్రయోజనాలు విజయ సాయి రెడ్డికి గుర్తుకు వచ్చాయి. దసరా దాకా పార్టీ ఏర్పాటును విజయసాయిరెడ్డి సస్పెన్స్ లో పెట్టారు.. కానీ ఇప్పటికీ ఏపీలో పరిస్థితి టిడిపి కూటమి వర్సెస్ వైఎస్ఆర్సిపి అన్నట్టుగానే ఉంది. అప్పట్లో షర్మిల పార్టీ పెట్టినప్పటికీ పెద్దగా సత్తా చూపించిన దాఖలాలు లేవు. విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల్లో రాజకీయ శూన్యత.. రాజకీయ అనివార్యత ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కనిపిస్తుంది అంటే.. నమ్మశక్యంగా లేదు.