YSRCP ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆలోచన చేస్తున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలా? లేకుంటే కుమారుడి కోసం మరో పార్టీలో చేరాలా? అనే ఆలోచనలో ఉన్నారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈనెల 25న జరిగిన వైసిపి సమన్వయకర్తల సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. తాడేపల్లి లో జగన్మోహన్ రెడ్డి క్రియాశీలక సమావేశం జరిగింది.. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడితోపాటు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడి హోదాలో ఆయనకు ఆహ్వానం ఉంది. అటువంటి కీలక సమావేశానికి ఆయన గైర్హాజరైనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన రాజకీయాలకు దూరమవుతారా? మరో పార్టీలో చేరుతారా? అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.
* సీనియర్ మోస్ట్ లీడర్..
తమ్మినేని సీతారాం సీనియర్ మోస్ట్ లీడర్. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేత. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తమ్మినేని సీతారాం మంత్రి అయ్యేవారు. అలా 2004 వరకు ఆయనకు మహర్దశ అని చెప్పవచ్చు. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పడిపోయారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం గెలిచి రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యారు. 2024 ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. ఇది ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డ్.
* మొన్నటి ఓటమితో..
మొన్నటి ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఓడిపోయిన తర్వాత ఆయన పరిస్థితి మరింత దిగజారింది. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న ఆయనను ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జిగా తప్పించారు. కనీసం ఆయన కుమారుడికైనా ఛాన్స్ ఇవ్వలేదు. ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న యువనేత చింతాడ రవికుమార్ కు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకొని శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టారు తమ్మినేని. అప్పటినుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు తమ్మినేని. చింతాడ రవికుమార్ ను తప్పించి తన కుమారుడికి ఇంచార్జ్ పోస్ట్ ఇప్పించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కావడం లేదు.
* మారిన జగన్ వైఖరి..
ఇటీవల జరిగిన పరిణామాలతో తమ్మినేని సీతారాం వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. చింతాడ రవికుమార్ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బలంగా సమర్థిస్తున్నారు. ఇటీవల భూ వివాదంలో తమ్మినేని ఫ్యామిలీ పై అనేక రకాల అభియోగాలు వచ్చాయి. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒకానొక దశలో అరెస్ట్ అవుతారని ప్రచారం నడిచింది. అయితే ఇదే జిల్లాకు మాజీ మంత్రి అప్పలరాజు పరామర్శకు వచ్చారు జగన్. కానీ తమ్మినేని మాటమాత్రానికైనా పరామర్శించలేదు. ఆపై ఇదే పర్యటనలో ఓ మహిళా ఎస్సై పై అనుచిత ప్రవర్తనకు సంబంధించి చింతాడ రవికుమార్ అరెస్ట్ అయ్యారు. ఆయనను ఫోన్లో పరామర్శించిన జగన్ ప్రెస్మీట్లో సైతం ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ఫుల్ క్లారిటీ వస్తోంది తమ్మినేని సీతారాంకు. అందుకే ఆయన రాజకీయాలకు స్వస్తి పలకడమా? గత పరిచయాల నేపథ్యంలో జనసేనలోకి వెళ్లడమా? అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా జనసేనకు వెళ్తారని జోరుగా ప్రచారం నడిచింది. ఇప్పుడు కూడా అటువంటి ప్రచారం మొదలైంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.