Srikakulam YSRCP: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని చెబుతుంటారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారులు సప్తసముద్రాలు వెనుక ఉన్న సరే తీసుకొస్తామని చెబుతుంటారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి విలేకరుల సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటారు. పైగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఉంటారు.
వాస్తవానికి ఏ పార్టీకైనా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు.. నాయకులు బలంగా ఉండాలి. అలాకాకుండా లేని బలాన్ని నాయకుడు ముందుగానే ఊహించుకొని.. ఎలాగైనా గెలుస్తామని చెప్పడం నాయకుడి అసమర్థతకు బలమైన నిదర్శనం. వైసీపీ అధినేత జగన్ లో ఇదే కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు . కాకపోతే ఇప్పటివరకు ఆ పార్టీ నాయకులు పరోక్షంగా ఈ విషయాలు చెప్పేవారు. ఇప్పుడు ఓపెన్ గానే అంటున్నారు .
శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఆయన వెల్లడించారు. శ్రీకాకుళం అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణ దాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. పార్టీలో క్రమశిక్షణ అనేది లేదని.. పార్టీలో ఉన్న నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని.. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణ దాస్ కనీసం వాటిని ఖండించే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారని అన్నారు. కులాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారని.. ఒక కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చిరంజీవి నాగ్ మండిపడ్డారు. ధర్మాన ప్రసాదరావు కూడా అభద్రతాభావం లో ఉన్నారని వ్యాఖ్యానించారు. బుడి ముత్యాల నాయుడికి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలతో ఏం పని అని చిరంజీవి నాగ్ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై కూడా చిరంజీవి నాగ్ మండిపడ్డారు..
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కృష్ణ దాస్.. ధర్మాన ప్రసాదరావు.. గొర్లె కిరణ్ కుమార్.. తమ్మినేని సీతారాం వంటి నాయకులు ఉండేవారు. 2019లో వీరంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో వైసిపి విజయానికి కృషి చేశారు. కానీ 2024 లో మాత్రం వీరి పాచికలు పారలేదు. వీరంతా కూడా ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో తమ్మినేని సీతారాం మీద తీవ్రస్థాయిలో భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. ఇందులో తమ్మినేని సీతారాం అనుచరుడు చింతాడ రవికుమార్ అరెస్టయ్యారు. అయితే సీతారాంకోర్టు దాకా వెళ్లి తన అరెస్టును నిలుపుదల చేయించుకున్నారు. వాస్తవానికి ఇటువంటి వ్యవహారాన్ని టిడిపి నేతలు విమర్శించాలి. కానీ యాదృచ్ఛికంగా వైసిపి నేతలే ఆ పని చేస్తున్నారు. తమ్మినేని సీతారాంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందువల్లే చిరంజీవి నాగ్ తెరమీదకి వచ్చారు. వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాదు ఇలాగే కొనసాగితే స్థానిక ఎన్నికల్లో శ్రీకాకుళంలో వైసిపికి ఒక్క సీట్ కూడా రాదని జోస్యం చెప్పారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో వైసిపి నాయకత్వం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రూపులు బయటపడుతున్నాయి. స్థానిక ఎన్నికల ముందు గ్రూపులు ఇలా బయటపడడం వైసిపికి కోలుకోలేని దెబ్బ.