Botsa Satyanarayana : విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వరుస సమావేశాల్లో భావోద్వేగానికి గురవుతున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయనకు అత్యంత సన్నిహితుడైన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మజ్జి శ్రీను పార్టీ మారిన తర్వాత చీపురుపల్లి, విజయనగరం తదితర ప్రాంతాల్లో బొత్స ఆధ్వర్యంలో వైసీపీ సమావేశాలు జరుగుతున్నాయి. కార్యకర్తలను సమీకరించి పార్టీకి అండగా నిలవాలని, కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా కలిసికట్టుగా పనిచేయాలని బొత్స పిలుపునిస్తున్నారు. అయితే సమావేశాల్లో మజ్జి శ్రీనుతో తమకున్న అనుబంధాన్ని కార్యకర్తలు, నేతలు గుర్తుచేసుకుంటుండటంతో వాతావరణం ఒక్కసారిగా భావోద్వేగంగా మారుతోంది.
బొత్స కంటతడి.. కార్యకర్తల ఓదార్పు
చీపురుపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మజ్జి శ్రీనుతో కలిసి పనిచేసిన రోజులను పలువురు నేతలు, కార్యకర్తలు గుర్తు చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. దీంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఆయనను ఓదార్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఆ తర్వాత జరిగిన విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలోనూ బొత్స మరోసారి భావోద్వేగానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో వరుస సమావేశాల్లో బొత్సను కార్యకర్తలు సముదాయించాల్సిన పరిస్థితి కనిపిస్తోందనే చర్చ మొదలైంది.
‘ఎవరు ఎవరికి ధైర్యం చెబుతున్నారు?’
ఇక్కడే అసలు ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. సమావేశాల్లో బొత్స కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. “వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం, వెళ్లడం సహజం.. పార్టీ మాత్రం శాశ్వతం” అంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ అదే సమయంలో బొత్స భావోద్వేగానికి గురైనప్పుడు కార్యకర్తలు, నాయకులే ఆయనను ఓదార్చాల్సి వస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లో సరదాగా ఒక ప్రశ్న వినిపిస్తోంది.. “బొత్స కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారా? లేక కార్యకర్తలే బొత్సకు ధైర్యం చెబుతున్నారా?” అని అయితే ఈ పరిణామాలను కేవలం వ్యక్తిగత భావోద్వేగంగా చూడాలా, లేక విజయనగరం జిల్లాలో వైసీపీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లకు ప్రతిబింబంగా చూడాలా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బొత్స మాత్రం పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండాలని, స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని వరుస సమావేశాల్లో పిలుపునిస్తున్నారు.
ప్రస్తుతం బొత్స సమావేశాల్లో కనిపిస్తున్న ఈ భావోద్వేగ దృశ్యాలు.. విజయనగరం వైసీపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న మార్పులకు మరో కోణాన్ని చూపిస్తున్నాయనే చర్చ సాగుతోంది.
బొత్స మీటింగ్లో సీన్ ఏంటి?
కార్యకర్తలకు బొత్స ధైర్యం చెబుతున్నారా? లేక.. బొత్సకే కార్యకర్తలు ధైర్యం చెబుతున్నారా?
మజ్జి శ్రీను వైసీపీని వీడిన తర్వాత వరుస సమావేశాలు నిర్వహిస్తున్న బొత్స..వరుస సమావేశాల్లో కన్నీటి పర్యంతం అవుతుండటంతో నేతలు, కార్యకర్తలు ఆయన్ను ఓదారుస్తున్నారు.
దీంతో ఎవరు, ఎవరిని ఓదార్చుతున్నారన్న చర్చ మొదలైంది.
#BotsaSatyanarayana
— Telugu360 (@Telugu360) October 5, 2026